‘‘అన్నా మేడమ్‌ ఫోన్‌ రింగ్‌ అవుతోంది కానీ తీయడం లేదు...’’ ఓ వైపు టైమవుతుంటే ఏం చేయాలో తెలియక ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన శ్రీకాంత్‌, ప్రశాంత్‌లకు ఫోన్‌ చేశాడు కారు డ్రైవర్‌ రమేష్‌.‘‘ఇంకోసారి ట్రైచెయ్‌...’’‘‘ఇప్పటికే చాలాసార్లు ట్రై చేశా...’’‘‘ఇంతకీ నువ్వెక్కడున్నావ్‌...’’‘‘మేడమ్‌ ఇంటి దగ్గరే ఉన్నా...’’‘‘సరే నువ్వు అక్కడే ఉండు. మేమిప్పుడే వస్తున్నాం...’’‘పొద్దున్నే షూటింగ్‌కు అటెండవ్వాల్సిన హీరోయిన్‌ కారు వచ్చేసరికి రెడీగా ఉండాలి కదా! ఫోన్‌చేసినా ఎందుకు తీయడం లేదు...’ అనుకుంటూనే ఆమె ఫోన్‌కు మరోసారి ట్రై చేస్తూ కాసేపటికి బంజరాహిల్స్‌ సమీపంలోని కృష్ణానగర్‌లోని ఓ ఇంటి దగ్గరకు చేరుకున్నారు శ్రీకాంత్‌, ప్రశాంత్‌.

‘‘ఏంట్రా ఫోన్‌ రింగవుతోంది కానీ తీయడం లేదు... పద...’’ అంటూ పై అంతస్థులో ఉన్న పోర్షన్‌ దగ్గరకు ముగ్గురూ వెళ్లారు.గుమ్మం ముందు ఆగి తలుపుకొట్టారు.లోపలి నుంచి నో రెస్పాన్స్‌.గదిలో లైట్ల వెలుతురు కన్పిస్తోంది.తలుపులు దగ్గరగానే ఉన్నట్లు గుర్తించి తలుపును కొంచెం బలంగా నెట్టారు. అంతే... లోపలి సీన్‌ చూసి ఒక్కసారిగా వారి గుండె చెదిరిపోయింది.వర్ధమాన హీరోయిన్‌ భార్గవి రక్తపుమడుగులో ఉంది. ఆమె పక్కనే మరో వ్యక్తి కూడా శవమై కనిపించాడు.

కొన్ని నిమిషాల్లోనే ఆ వార్త దావానలంలా వ్యాపించింది.వర్ధమాన హీరోయిన్‌, ‘అష్టాచమ్మా’ ఫేమ్‌ భార్గవిని హత్య చేశారన్న విషయం టీవీల్లో బ్రేకింగ్‌న్యూస్‌గా రావడం మొదలైంది. భార్గవిని ఎవరు హత్య చేశారు? నిన్న మొన్నటి వరకు సెకండ్‌ హీరోయిన్‌గా ఉన్న భార్గవికి ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి సమయంలో హత్య ఎందుకు జరిగింది? ఇంతకీ భార్గవి పక్కన నిర్జీవంగా పడి ఉన్నది ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?బంజారాహిల్స్‌ ఏసీపీ రామకృష్ణయ్య అక్కడకు చేరుకున్నారు.

గదిలోపల రెండు మృతదేహాలు కన్పించాయి. మంచంపై నీలిరంగు జీన్స్‌ ప్యాంటు వేసుకున్న భార్గవి అచేతనంగా పడి ఉంది. ఆమె కాలి మీద నిర్జీవంగా ఓ యువకుడు. భార్గవి శరీరంపై కత్తిపోట్లు కన్పించాయి. ఆమె తలకింద ఉన్న దిండు, పరుపు రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. మంచం పక్కన నేల మీద రక్తం మరకలు అంటిన కత్తి పడి ఉంది. పక్కనే ఒక కూల్‌డ్రింక్‌ సీసాతో పాటు, తెల్లటి పొడి ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌ను కూడా గమనించారాయన.