ఎవరు పంపించారు మీకీ వీడియో? అడిగాడు డిటెక్టివ్‌ శరత్‌. చెప్పాడతను. అంతలోనే అతనికి ఫోన్‌ వచ్చింది. ఆ కాల్‌ మాట్లాడుతుంటే అతడి ముఖంలో రంగులు మారాయి. అతనికి ఫోన్‌చేసినవాడు చెప్పిందేమిటో తెలుసుకున్న శరత్‌ అలర్టైపోయాడు. వెంటనే తన మనుషుల్ని పంపించాడు. కానీ సవాలు చేసిన వ్యక్తి చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాడు. శరత్‌ మనుషులు వెళ్ళేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది!

ఆ వీడియో చూసి స్థాణువైపోయాడు డిటెక్టివ్‌ శరత్‌.చాలాసేపు గదిలో నిశ్శబ్దం తాండవించింది.‘ఎలావచ్చింది మీకీ వీడియో?’ అతికష్టం మీద గొంతు పెగల్చుకుని అడిగాడు శరత్‌.‘పాలవాడు పాల పాకెట్లు వేసేందుకు మా ఇంటి గేటుకి సంచీ కట్టి ఉంటుంది. దాంట్లో ఎవరో ప్యాకెట్‌ ఉంచారు. ఏమిటా అని తీసి చూస్తే పెన్‌డ్రైవ్‌ ఉంది.ఏముందో, అని పెట్టిచూస్తే ఇది ఉంది. చెప్పాడాయన. ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగు తున్నాయి.‘పోలీసులకి చెప్పారా?’‘లేదు.

ఇది చూడగానే తిన్నగా మీ దగ్గరకే వచ్చాను’ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి ఫోన్‌ చేశాడు శరత్‌. విజయ్‌తో మాట్లాడి ఫోన్‌ పెట్టేస్తుండగా ఎదురుగా ఉన్నాయన ఫోను మోగింది.ఫోను ఎత్తి ‘హలో’ అన్నాడాయన. ఆయననే గమనిస్తున్న శరత్‌ ఆయన ముఖం భయంతో నిండటం చూశాడు.ఫోను పెట్టేసి ఏడవటం మొదలు పెట్టాడాయన.శరత్‌ మౌనంగా ఉన్నాడు. ఆయన ఏడుపు ఉధృతి తగ్గనిచ్చాడు.ఇంతలో విజయ్‌ గదిలోకి వచ్చాడు. ‘ఏమిటీ అర్జంటుగా రమ్మన్నావు?’ అంటూ.

‘ఈయన పేరు విజ్ఞానేశ్వరరావు. ప్రముఖ వ్యాపారి. ఆయనకు ఎవరో ఓ పెన్‌డ్రైవ్‌ పంపించారు. దాన్లో ఓ అమ్మాయిని కిరాతకంగా చంపిన వీడియోక్లిప్‌, ఒకటిన్నర నిముషానిది ఉంది. అదేమిటో తెలుసుకోవాలని నా దగ్గరకు వచ్చాడు. హత్యకు సంబంధించింది కాబట్టి నిన్ను పిలిచాను’.కన్నీళ్లు తుడుచుకుని గద్గద స్వరంతో చెప్పాడు విజ్ఞానేశ్వరరావు.‘ఆ వీడియో నాకు ఎందుకు పంపించాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఫోను వల్ల తెలిసింది. వాడికి నా కూతురు నచ్చిందట. ఆమెను ఎత్తుకు వెళ్తాడట. ఆమెను ఏం చేస్తాడో నాకు ఆ వీడియో ద్వారా తెలిపాడట’ మళ్ళీ ఏడవటం ఆరంభించాడు.‘ఇప్పుడు మీ కూతురు ఎక్కడ ఉంది?’ అడిగాడు శరత్‌.