బ్యాంక్‌ ముందు గుంపులుగా నిలబడి నినాదాలు చేస్తున్న కస్టమర్లను దాటుకుని బ్యాంక్‌లోకి అడుగు పెట్టాడు డిటెక్టివ్‌ శరత్‌.లోనికి వెళ్ళగానే ఎదురేగి ఆహ్వానం పలికిన బ్యాంక్‌ అధికారి, శరత్‌ను కాన్ఫరెన్స్‌గదిలోకి తీసుకెళ్ళాడు.ధనం, అధికారం ఉట్టిపడే మరో ఐదుగురు బ్యాంకు అధికారులు అప్పటికే ఆ కాన్ఫరెన్స్‌గదిలో కూర్చుని ఉన్నారు. అందరూ గంభీరంగా ఉన్నారు.

‘‘బయట హడావిడిగా చూశారుగా?’’ శరత్‌ని అడిగాడు అక్కడ కూర్చున్న వాళ్లందరికీ అధికారిగా కనిపించే ఆయన.తల ఊపాడు శరత్‌.‘‘ఎ.టి.ఎం ఫ్రాడ్‌. మొన్నటిదాకా ఎ.టి.ఎంలో డబ్బులులేవని గోల. ఇప్పుడు ఉన్న డబ్బులు ఎవరో దొంగతనం చేశారని గోల. ఎలాగైనా ఈ నేరం చేసినవారిని వెతికి పట్టుకోవాలి. నేరం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. మరోసారి నేరం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీరే చెప్పాలి’’ ఒక ముక్కలో అన్నీ చెప్పేశాడాయన.‘ఇది మా బ్యాంక్‌ను దివాళా తీయించేందుకు శత్రుబ్యాంక్‌ చేస్తున్న కుట్ర. మీరు దాన్ని నిరూపించాలి’’ ఇంకో అధికారి అన్నాడు.నవ్వాడు శరత్‌.

‘‘ఒకో మెట్టు ఎక్కుదాం. ఒకేసారి అన్నిమెట్లూ దాటాలని ప్రయత్నించటంవల్ల ఫలితం ఉండదు. ఇప్పుడు చెప్పండి. ఏం జరిగింది?’’ అడిగాడు శరత్‌. ‘‘బాస్‌, బ్యాంక్‌ వాళ్లు బాస్‌ నువ్వు అడిగిన వివరాలనీ పంపించారు’’ ఫైల్స్‌ శరత్‌ టేబుల్‌పై పెడుతూ చెప్పాడు అసిస్టెంట్‌ రాము.ఫైల్స్‌ను రెండుగా విభజించి, సగం భాగం రామువైపు నెట్టాడు శరత్‌.‘రామూ, ఈ ఫైల్స్‌ నువ్వు పరిశీలించు. వీటిలో ఏయే ఏ.టి.ఎంలలో ఏ సమయంలో డబ్బులు ‘డ్రా’ చేశారో పట్టిక తయారుచెయ్‌’’‘‘ఇదంతా ఏంటి బాస్‌?’’ అడిగాడు రాము.‘ఎవరో దొంగలు పనికట్టుకుని ఈ బ్యాంక్‌ ఎ.టి.ఎంలలోంచి డబ్బు దొంగతనంగా డ్రా చేస్తున్నారు. బ్యాంక్‌ డెబిట్‌ కార్డుల వివరాలు సేకరించారు. అంటే, ఈ బ్యాంక్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ సరిగాలేదని నిరూపించాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు’’ చెప్పాడు శరత్‌.