ఒక పేరున్న ప్రైవేట్‌ కంపెనీలో అనిరుధ్‌ సి.ఇ.ఓ. కంపెనీని వృద్ధిచేసి చక్కటి పేరు సంపాదించుకున్నాడు. కానీ కంపెనీ అధికారులు ఖర్చులు తగ్గించాలనుకుని పెద్దజీతగాళ్లను తొలగించారు. అనిరుధ్‌ మీద కూడా వేటు పడింది. ఆ స్థానంలో అనిరుధ్‌ మాజీభార్య భవాని బాధ్యతలు చేపట్టింది. పదేళ్లక్రితమే అనిరుధ్‌ నుంచి విడాకులు తీసుకుంది భవాని.బహిరంగ దూషణలు, ఆరోపణలతో ఆ తంతు ముగిసింది. అతన్ని బిచ్చమెత్తుకునేట్టు చేస్తానని ఆనాడే ప్రతిజ్ఞ చేసింది భవాని. తన జాబ్‌లో భవానీ చేరడం అనిరుధ్‌కి నచ్చలేదు. ఉద్యోగం వదిలేదిలేదని కంపెనీతో గొడవపెట్టుకున్నాడు. ఇంతలో ఓ రోజు భవానీ, అనిరుధ్‌ ఇద్దరూ ఆఫీసుకు రాలేదు. ఆరోజే అనిరుధ్‌ ఇంటి బెడ్రూములో భవానీ శవం లభించింది. అంతలోనే మరోవార్త. ఆమెను కాల్చిచంపి, విమానంలో హైదరాబాద్‌వెళ్లి హోటల్‌గదిలో అదే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోయాడు అనిరుధ్‌.

భవానీని అనిరుధ్‌ చంపాడనే ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆమెనిచంపి, క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్లి చెకిన్‌ అయ్యే సమయం, హోటల్లో గది తీసుకున్న సమయం అన్నీ సరిగ్గా మ్యాచ్‌ అయ్యాయి. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ఇచ్చిన ఆ నివేదిక మొత్తం చదివాడు డిటెక్టివ్‌ శరత.‘నాకు ఎందుకో సంతృప్తి కలగలేదు. క్రాస్‌చెక్‌ చేసేందుకే నిన్ను పిలిచాను’ అన్నాడు విజయ్‌.‘‘అనిరుధ్‌ విమానంలో ప్రయాణం చేయకుండా ఉండివుంటే, అతడిది ఆత్మహత్య కాదనటానికి ఆధారాలు ఉండేవి కావు’ అన్నాడు శరత.

‘అంటే అది ఆత్మహత్య కాదంటావా?’ అడిగాడు విజయ్‌.‘అనిరుధ్‌ స్వంత తుపాకీతో కాల్చుకున్నాడంటున్నారు?’‘అవును, భవానీని చంపిందీ, తను కాల్చుకుని చనిపోయిందీ ఒకటే తుపాకీ.‘విమానం ఎక్కే ముందు చెకింగ్‌ ఉంటుందికదా? తుపాకీని హైదరాబాద్‌ ఎలా తీసుకెళ్లాడు?’ అడిగాడు శరత.అలా చూస్తూ ఉండిపోయాడు విజయ్‌.అసిస్టెంట్‌ రాముకు ఫోన్‌ చేశాడు శరత.‘రామూ, భవాని, అనిరుధ్‌ల ఫోను నంబర్లు కాల్‌డేటా, వాళ్ల కదలికల వివరాలు సేకరించు’ చెప్పాడు.‘అనిరుధ్‌ ఆత్మహత్య చేసుకుంటే సెక్యూరిటీ కన్నుగప్పి తుపాకీని అతడు ఎలా తెచ్చాడో తెలుసు కోవాలి’ గంభీరంగా అన్నాడు శరత.‘విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేయటం ఇబ్బందిగా ఉంటుందని అతడిని విజయవాడకి, భవానీని చెన్నై పంపించాం. అనిరుధ్‌ని తొలగించాక అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు చెన్నై నుంచి విజయవాడకు వచ్చింది భవాని. వచ్చాక ఇలా జరిగింది’ విషాదంగా చెప్పాడు కంపెనీ అధికారి.