‘‘వ్యవసాయం మానెయ్‌ నాన్నా, పొలం కౌలుకిచ్చెయ్‌, పట్నం వెళ్ళిపోదాం పద’’ అన్నాడు కోపంగా. వచ్చినప్పుడల్లా కొడుకు ఈ మాట అంటూనే ఉన్నాడు. ‘‘చూద్దాంలేరా...’’ అని తను దాటవేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి వీడి మాటల్లోని కరుకు చూస్తుంటే వదిలేలాలేడు అనిపించింది రాంరెడ్డికి.

‘‘రైతనేనోడు భూమిని వదిలిపెట్టి ఉండలేడురా’’ అన్నాడు రాంరెడ్డి వేదాంత ధోరణిలో.‘‘ఈ మాటలింక చెప్పకు నాన్నా, భూమిని వదిలేసి, మన ఊళ్ళోనే పన్నెండు కుటుంబాలు పట్నం వెళ్ళిపోయాయి. వ్యాపారాలు చేసుకుంటూ, పిల్లల్ని చదివిచ్చుకుంటూ సుఖంగా బతుకుతున్నారు. వ్యవసాయానికి పెట్టే పెట్టుబడెంత? నీ కష్టమెంత? నీ కొచ్చేదెంత? అప్పులపాలై, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదంతా నీకు తెలుసు. అయినా నువ్వు వ్యవసాయాన్ని వదలవు. ఈ ఊరును వదిలిపెట్టి నా ఇంటికి రమ్మంటే రావు’’ అన్నాడు రుసరుసలాడుడూ శేఖర్‌ రెడ్డి.

‘‘ఇంతకాలం నేను బతికింది ఆ వ్యవసాయం మీదేరా’’ అన్నాడు నెమ్మదిగా.‘‘నిజమే, కానీ పొలంలో జారి, మంచంలో పడితే చేసే వారెవరున్నారు చెప్పు? అమ్మ ప్రేమ నాకు తెలీదు నాన్నా. నీ ప్రేమకు కూడా నోచుకోకపోతే నా బతుకెందుకు చెప్పు. మొన్న సోమిరెడ్డి పెదనాన్న ముఖం పట్టుకుని అడిగాడు, ‘‘నీ సుఖం, నీ పెండ్లాం సుఖం చూసుకుంటే సరిపోతుందేరా? ముసలోడు ఈ వయసులో గూడ కష్టపడాల్నా అని...?’’ నీటి పుట్ట బద్దలై కాలువలుగా సాగినట్లు, గుండెలోని బాధంతా శేఖర్‌రెడ్డి చెంపల మీదుగా కన్నీరై ధార కట్టింది.గాబుకాడ అంట్లు కడుగుతున్న సాయమ్మ, కట్టెలు పగల గొడుతున్న తిరపతయ్య పరిస్థితి గమనించి, దగ్గరికొచ్చారు.