‘‘నాన్నగారు ఎలా ఉన్నారు? అమ్మ, తమ్ముడూవాళ్ళు ఏం చేస్తున్నారు?’’ అమెరికా నుండి పెద్దకొడుకు శ్రీరామ్‌ ప్రేమగా ఫోనులో పలకరించాడు.‘‘మేం అందరం కులాసాగానే ఉన్నాం. నేను అమ్మా ఆరుబయట వెన్నెల్లో కూర్చుని మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీ తమ్ముడు ఏదో మ్యాచ్‌ చూస్తున్నాడు’’ అని ఎంతో ఆనందంగా కొడుకుతో చెప్పిన అవధాని మీరెలా ఉన్నారని తిరిగి శ్రీరామ్‌ని అడిగాడు.

‘‘ఇదిగో ఇప్పుడే పిల్లలు స్కూలుకి వెళ్ళారు. మేం కూడా ఆఫీసుకు రెడీ అవుతున్నాం. మళ్ళా వీకెండ్‌ వరకు ఉరుకులుపరుగులే. పిల్లలు కూడా పాపం ఉన్నది ఏదో తినేఏసి వెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా మేం ఇక్కడ ఎక్కువగా తినేది పాచి తిళ్ళే’’ నవ్వుతూ అన్నాడు శ్రీరామ్‌.‘‘సరేలేరా! మీకు తీరుబడి ఉండదు కాబట్టి రెండు పూటలకు సరిపడా చేసుకుని రాత్రికి అవే వేడి చేసుకుని తింటారు. గుర్తుందా మీ చిన్నప్పుడు రాత్రిమిగిలిన అన్నాన్ని, అమ్మ తర్వాణీలో దబ్బాకు వేసి కుండలో పెడితే మర్నాడు ఆ చద్దెన్నంలో ఊరగాయ వేసుకుని మీరు ఎంతో ఆనందంగా తిని స్కూలుకి వెళ్ళేవారు’’ ఆనాటి రోజులు గుర్తుచేస్తూ అన్నాడు అవధాని.

‘‘అయ్యో ఎందుకు గుర్తులేదు. ఆ రోజులు మళ్ళీ రమ్మన్నారావు. ఈనాటి పిల్లలకు అవేమి తెలియవు, ఎంతసేపూ పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు ఇవే. వాటి వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని ఎంత చెప్పినా వినరు. అది సరే, ఇంతకీ మీ షష్టి పూర్తి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏమిటో అప్పుడే మీకు అరవై సంవత్సరాలు నిండుతున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు’’ అని మళ్ళీ నవ్వుతూ అన్నాడు శ్రీరామ్.