శనివారం వస్తే సాయంత్రమే పెందుర్తిలో ట్రైనెక్కి సొంతూరికి ప్రయాణం.మళ్ళీ సోమవారం ఉదయాన్నే అక్కణ్ణించినేరుగా నేను పనిచేసే ఊరికి వెళ్ళిపోవడం రివాజు. ఓ చిన్న బస్తీలో ఉన్న జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఆ బస్తీకి దగ్గరలో ఉన్న విశాఖలో ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటున్నాను.అమ్మా, నాన్న, .అక్క..అందరూ మా స్వగ్రామంలోనే ఉంటారు. నాన్న వ్యవసాయం చేస్తున్నారు.

సెల్‌ఫోన్‌ మరచిపోయిన విషయం గుర్తుకొచ్చి వెనక్కివచ్చి నా గది తలుపు తీసి లోపలకు వెళ్ళాను.‘‘ఈ రోజు రెండవ శనివారంకదా, మీకు సెలవుకాదా.?’’ నా గది ముందున్న వరండాలోకి వచ్చి అడిగింది శాంతి. ‘శాంతి’ కపోతంలా మెరిసే దుస్తుల్లో మరింత మెరుపులీనుతూ ఉంది.‘‘లేదండీ, కోర్సు పూర్తిచేయాల్సి ఉందని సెలవు ఇవ్వలేదు. ఏమిటి విశేషం?’’ ఆమె చేతిలో స్వీట్స్‌ వగైరా ఉన్న ప్లేట్‌ను చూస్తూ చిన్నగా నవ్వి అన్నాను.‘‘ఈరోజు నా పుట్టినరోజు’’ ప్లేట్‌ అందిస్తూ అంది.‘‘అలాగా... హ్యాపీ బర్త్‌డే అండీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే..’’ విష్‌ చేశాను, ప్లేట్‌ అందుకుంటూ.‘‘థాంక్యూ...థాంక్యూ..’’ ముసిముసిగా నవ్వింది.‘‘ముందుగా చెప్పారు కాదు’’ నవ్వు మాటున నిష్ఠూరంతో అన్నాను.

‘‘ఫంక్షన్‌లా చేయడం ఎప్పుడూ లేదండీ, అందుకని ఎవరికీ చెప్పే అవసరం కలగలేదు. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా....’’ఓ స్వీట్‌ తీసుకున్నాను. నా కిష్టమైన కాజూబర్ఫీ అది...!‘‘ఈరోజు సాయంత్రం వస్తారా?’’‘‘రానండీ, మళ్ళీ సోమవారమే. మీ అమ్మగారున్నారా?’’‘‘ఇంకా రాలేదండీ...’’‘‘అయితే ఫస్ట్‌ విషెస్‌, ఫస్ట్‌ స్వీట్‌ ఇక్కడేనన్నమాట’’ నవ్వుతూ అన్నాను.‘‘లేదండీ, అమ్మ తెల్లవారుజామునే ఫోన్‌ చేసి చెప్పింది. తర్వాత అన్నయ్య...ఉదయాన్నే మా ఫ్రెండ్స్‌ చెప్పారు’’