జీవితం చాలా గొప్పది. అంతకుమించి చాలా చిన్నది, ఎంతో విలువైనది. సకాలంలో దీన్ని గుర్తించగలిగినవారు అద్భుతాలు సృష్టిస్తారు. ఆ సత్యాన్ని గ్రహించలేనివాళ్లు అపరిపక్వ ఆలోచనలతో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ, తమ చుట్టూ ఉన్న పదుగురికీ హానిచేస్తూ, బతికేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇలాంటివాళ్ళకు కళ్ళు తెరిపించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ కథలో కూడా ఇలాగే జరిగింది

..................................................................

విశాఖపట్నం బీచ్‌. సాయంత్రం నాలుగు గంటలు.ఆకాశం నిర్మలంగా ఉంది. నీలంరంగు సముద్రం. తెల్లటి కెరటాల నురుగుతో ప్రఖ్యాత చిత్రకారుడి పెయింటింగ్‌లా ఉంది.ఆదివారం జనం అన్నివైపులనుంచి కార్లలో, స్కూటర్లపై, బైకులమీద, నడిచీ వస్తున్నారు. ఒకటే హడావుడి. ఇలా వచ్చిపోయే జనాలని ఎంతోమందిని చూసింది సముద్రం.సముద్రాన్నిచూస్తూ రామక్రిష్ణామిషన్‌కి ఎదురుగా ఉన్న పార్కులో సిమెంట్‌ బెంచ్‌మీద రామారావు, లక్ష్మి కూర్చున్నారు. వాళ్ల అబ్బాయి నరేష్‌, వాళ్లకి ఎదురుగా నిలబడ్డాడు.‘‘అమ్మా! ఆ ఇసుకలోకి రండి’’ అన్నాడు నరేష్‌.‘‘వద్దురా’’ అన్నాడు రామారావు.‘‘ఏం?’’ అన్నాడు నరేష్‌.‘‘అమ్మ ఆ ఇసుకలోకి రాలేదురా. నువ్వెళ్ళు’’ అన్నాడు రామారావు పల్లీలపొట్లంలోంచి రెండు పల్లీలు తీసి నోట్లో వేసుకుంటూ.‘‘అదే ఎందుకంట?’’ రెట్టించాడు నరేష్‌.‘‘చెప్తే వినవేట్రా?’’ విసుకున్నాడు రామారావు.‘‘అలా చెప్తే వాడికెలా అర్థమవుతుంది? నాకు కాలు నొప్పిగా ఉంది నాన్నా. నేను రాలేను’’ అంది లక్ష్మి చీరచెంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ.

‘‘రామ్మా. ఫరవాలేదు’’ అంటూ తల్లి లక్ష్మి చేతిని పట్టుకులాగాడు నరేష్‌.‘‘వద్దు నరేష్‌! అమ్మకి బాగా కాలునొప్పిగా ఉంది. నువ్వెళ్ళు అలా తిరిగి రా. నీళ్ళల్లోకి వెళ్లకు. ఇక్కడ నుంచి మాకు కనిపించేటట్లుగా ఉండు’’ అన్నాడు రామారావు కొన్ని పల్లీలు కొడుకుచేతిలో వేస్తూ ‘‘బీచ్‌కి వచ్చింది నేనొక్కడినే తిరగడానికా? అలా అయితే మా ఫ్రెండ్స్‌తోనే వెళ్ళేవాణ్ణి కదా’’ చిరుకోపంగా అన్నాడు నరేష్‌.కొడుకు మొహంలో కోపంచూసి కదిలిపోయింది లక్ష్మి. లేచింది. నరేష్‌ భుజంమీద చెయ్యి వేసింది. ‘‘పదరా వస్తాను’’ అంది ముందుకు అడుగేస్తూ.‘‘అరే. చెప్తుంటే వినవేంటి? డాక్టరు ఏం చెప్పాడు? నడవొద్దన్నాడు కదా. ఇసకలో నడుస్తావా. నొప్పి ఎక్కువవుతుంది. వద్దు’’ అన్నాడు రామారావు కోపంగా లేచి నిలబడి.