అపసోపాలుపడి రైలుదిగితే ఎప్పట్లా ఫ్లాట్‌ఫాం మీదకు రాలేదు మేనల్లుడు. ఎన్నో కుశంకలతో బైటికొచ్చి కారుతెచ్చాడేమో అని చూస్తే షేర్‌ ఆటో ఎక్కించెళ్ళిపోయాడు. బంగారంలాంటి గ్రౌండ్‌ఫ్లోర్‌ ఇల్లొదిలి ఐదో అంతస్తులోకి మారిపోయాడు. నానాయాతనాపడి మెట్లెక్కితే ఇంట్లోకెళ్ళగానే పిల్లపిశాచాలు మీదపడ్డారు! అంతేకాదు, టైఫాయిడిల్లూ, హోటల్‌ క్యారేజీ...! ఎందుకొచ్చానురా భగవంతుడా! అనిపించేట్టు చేశారామెను.

ఆంధ్రరాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించటం కాదుగానీ నిద్రనుంచి అకస్మాత్తుగా లేచిన ఆకలిగొన్నసింహం ఒక్కసారి జూలు విదిలించినట్టు బెజవాడలోను చుట్టుప్రక్కలా రియల్‌ఎస్టేట్‌తో సమానంగా ఇళ్ళ అద్దెలు, కూరగాయలు, నిత్యావసరవస్తువుల ధరలు విజృంభించేశాయి. దాంతో వచ్చేపోయేవారితో మధ్యతరగతి మొహమాట జీవులకు మహాప్రాణసంకటంగాఉంది.ఆరోజు... బెజవాడ స్టేషన్‌స్టేషనంతా జనంతో నేల ఈనినట్టుంది. రైలు దిగగానే ఇదివరకులాగా తన బరువైన సంచీలు అందుకునేందుకు మహా మొహమాటస్థుడైన వేలువిడిచిన మేనల్లుడు కృష్ణమూర్తి కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది భారీకాయం భానుమతమ్మకి.

‘అయినా ఈ గాభరా మాకిష్టుడు కనిపించేంతవరకేగా... తర్వాత నాకు రాజభోగమే’ అని తనకు తానే సర్దిచెప్పుకుంటూ భానుమతమ్మ తన భారీకాయంతోను చేతిలో భారీ లగేజీతోనూ అడ్డొచ్చినవాళ్లను బలంగా తోసేసుకుంటూ స్టేషను బయటకువచ్చి మేనల్లుడి పూలపడవలాంటి కారుకోసం నాలుగు వైపులా ఆత్రంగా కనుగుడ్లు తిప్పింది.‘భానత్తా ఇదిగో ఇక్కడ.... ఇలా రా...’ అంటూ కిష్టుడి కంఠం వినిపించి ఆవిడకి ప్రాణం లేచొచ్చింది.‘‘ఒరేయ్‌ కిష్టుడూ ఎన్నాళ్లయిందిరా మీ కాపురంచూసి...ఎప్పుడో మీ పెళ్ళైన కొత్తల్లో రావడమే...మళ్ళీ ఇన్నాళ్ళకి నిన్ను చూడాలనిపించి ఇదిగో ఇలా వచ్చాను’’ అవసరం గడుపుకోవడానికి మాత్రమే వచ్చే భానుమతమ్మ కడుపులో ఇసుమంతైనా లేని ప్రేమను మాటల్లో మాత్రం తెగ గుమ్మరించేసింది.క్రిష్ణుడు ఉరఫ్‌ కృష్ణమూర్తి మాత్రం మొహమాటంగా గొణుక్కున్నాడు.

‘అఘోరించకపోయావు. ఊళ్లో సొంతకొడుకు,కోడల్నీ పెట్టుకుని అక్కడ వాటంగా తినడం కుదరదని మాపెళ్ళైన కొత్తల్లో నాకు అదిష్టం ఇదిష్టం అంటూ మా శ్రీలతని వేపించుకుని తిని గొడ్డుచాకిరీ చేయించుకున్నదేకాక, మా ఏకాంతాన్ని మింగేసేలా జీడిబంకలా నెలరోజులు తిష్టవేసిగానీ కదిలావుకాదు నా వేలువిడిచిన భానత్తా!’ అనుకున్నాడు. ముఖానికి లేనినవ్వు పులుముకున్నాడు. ‘ఏ పుచ్చిపోయిన అటుకులో బూజుపట్టిన చింతకాయపచ్చడో తెచ్చి ఉంటుంది’ అని తెలిసీ ‘‘బావున్నావా భానత్తా! అబ్బో ఎంత పెద్దసంచీలో! నాకోసం ఏం మోసుకొచ్చావేంటి?’’ అన్నాడు సరదాగా.