అతడు మాంసాహారే. కాని పిట్టమాంసం మాత్రం ముట్టడు. ఎందుకంటే బాల్యం నుంచీ అతనికి పక్షులంటే ఎనలేని ప్రేమ. జీవవైవిధ్యం కాపాడటమే అతడి ఉద్దేశం! టెనెంట్‌ ఖాళీచేసిన అతనింట్లో పావురాలువచ్చి గూడుకట్టి గుడ్లుపెట్టాయి. దాంతో నిస్సహాయుడైపోయాడా పక్షిప్రేమికుడు. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయినా పావురాలు అక్కడే ఉండిపోయాయి. అప్పుడతను ఏం చేశాడు? అతని నైజం ఎలాంటిది?

వాకింగ్‌ చేసేప్పుడు సెల్‌ఫోన్లో పాటలువినడం నాకు అలవాటు. ఆ టైంలో పక్కనున్నవాళ్ళతో మాట్లాడటంగానీ, ఫోన్లు చెయ్యడంగానీ, రిసీవ్‌ చేసుకోవడంగానీ చెయ్యను. డిస్‌ప్లేమీద పేరుచూసి ఇంపార్టెంట్‌పర్సన్‌ అయితేనే ఆన్సర్‌ చేస్తా.అలాంటి ఫోన్‌కాల్‌ మా టెనెంట్‌నుంచి వచ్చింది. అర్జంట్‌ అయితేగానీ అతను కాల్‌ చెయ్యడు. ఫోనెత్తగానే ‘‘వణక్కం సార్‌! ఐ యామ్‌ వెకేటింగ్‌ ఇన్‌ ద నెక్స్ట్‌వీక్‌’’ అనిచెప్పి పెట్టేశాడు. ఆయనదంతా టెలిగ్రాం లాంగ్వేజ్‌.‘‘హేండోవర్‌ కీస్‌ ఎండ్‌ అదర్‌థింగ్స్‌ టు ద వాచ్‌మెన్‌’’ అనిచెప్పి నేనూ కట్‌చేశా. నేనేమన్నా తక్కువా? ఎక్కువ మాట్లాడ్డానికి! మళ్ళీ కథ మొదటికొచ్చింది. టెనెంట్స్‌వేట మొదలైంది. సిటీలో మంచి టెనెంట్స్‌ దొరకడం కష్టం.ఈ మూడేళ్ళూ ప్రశాంతంగా గడిచిపోయింది. ప్రతినెలా ఇంటిఅద్దె ఠంచన్‌గా బ్యాంకులో జమ చేసేవాడు. ఇల్లుకూడా చాలా నీట్‌గా ఉంచుకునేవాళ్ళు. ఇలాంటి మంచి టెనెంట్స్‌ దొరకడం ఓనర్స్‌కి వరం.పూర్వం ఇల్లు కట్టిచూడు. పెళ్ళి చేసిచూడు అనేవాళ్ళుగానీ, ఆ రెండూ ఇప్పుడంత కష్టమైనవేం కాదు.

ఇల్లు కట్టుకుంటారా? రెడీమేడ్‌ ఇల్లు కొనుక్కుంటారా? ఎంత కావాలంటే అంతఅప్పు ఇస్తామని బ్యాంకువాళ్ళే ఇంటికొచ్చి గడ్డంపట్టుకుని అడుగుతున్నారు. ఇక పెళ్ళంటారా..సంబంధం కుదిరి డబ్బులుంటే నల్లేరుమీద బండినడకే!కానీ ఇల్లు అద్దెకివ్వడంమాత్రం అంత వీజీకాదు. ఆ పాతసామెత చెప్పినోళ్ళుగానీ ఇప్పుడుంటే, ‘ఇల్లు కట్టడంకాదు. ఇల్లు అద్దెకిచ్చిచూడు’ అనే వాళ్ళేనేమో!బోలెడంత డబ్బుపోసి ఇల్లుకట్టుకుని అందంగా రంగులేసుకుని ముక్కూమొఖం తెలీనోళ్ళకి అద్దెకివ్వడమంత బుద్ధితక్కువపని ఇంకోటిలేదు.అందుకేనేమో తెల్లదొర ఎప్పుడో చెప్పాడు. ‘‘బుద్ధిలేనోళ్ళు ఇల్లు కడతారు, తెలివిగలవాళ్ళు అందులో ఉంటారు’’ అని. ఇది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం.సీతకష్టాలు సీతవి, పీతకష్టాలు పీతవన్నట్టు ఓనరుకష్టాలు ఓనరువి. అద్దెకుండేవాళ్ళే కష్టాలు చెప్పుకుంటారుగానీ ఓనరుక్కూడా కొన్ని కష్టాలుంటాయని నేను ఓనరయ్యాకే తెలిసింది.