నాయకులు, మత ప్రవక్తలు, విప్లవకారులు, ఆధ్యాత్మికవాదుల జీవిత చరి త్రలు గ్రంథాలయాల్లో మనకు కనిపిస్తాయి . ఆఖరికి దుర్యోధనుడు, గాడ్సే కథలూ ఉన్నాయి. సామాన్యుడి కథ మాత్రం లేదు . అతను అదే ఆలోచించాడు . ఒక కూలివాడి చరిత్ర రాయాలని బయలుదేరాడు . ఒక తాత దొరికాడు బస్టాండులో . ఆ తాత కథ విన్నాక ఆ రచయితకు భయం వేసింది. మరి అతడికెందుకు భయం వేసింది ? కారణం ఏమిటి ?

చాలా రోజుల్నుంచీ నాకో అనుమానం. నా అనుమానానికి కారణం. నాలో ఉన్న అసంబద్ధమైన ఆలోచనలేమోనని చాలాసార్లు అనుకున్నా. పైకి చెప్పలేకపోతున్నానుగానీ, నావి మరీ అంత అసమంజసమైన ఆలోచనలు కావేమోనని మరో అనుమానం.ఈ అనుమానానికి కారణం నాలాగా ఆలోచించిన కొంతమంది కనిపించడం. ఇలా పోల్చడం తప్పేగానీ, వాళ్ళలాగే నేనుకూడా ఆలోచిస్తున్నప్పుడు, నా ఆలోచన అసంబద్ధమెలా అవుతుంది. ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ‘శ్వేదం చిందించిన శ్రమను మేలి వస్త్రంగా మలిచారని’ ఆరుద్రగారు అన్నారు. ‘కండలు కరగేసి, బండలు పగలేసేమ్‌’ అన్నాడు బంగోరె.

‘సామాన్యుడి ఆలోచనలు, అక్కరలు పెనుఉద్యమాలకు మూలమవుతాయి’ అని మార్క్స్‌ లాంటి వాళ్ళన్నారు.ఇట్టా అన్న వీళ్ళందరి జీవిత చరిత్రలు, ఆత్మకథలు మనకున్నాయి.గానీ వారన్న సామాన్యుడి జీవిత చరిత్రగానీ, ఆత్మకథగానీ, ఎక్కడాలేదు. పోనీ చదువులేని నిరక్ష రాస్యులు కాబట్టి ఆత్మకథలు రాసుకోలేరు. కానీ పెద్దలనుకున్న వాళ్ళలో ఒక్కరైన జీవిత చరిత్ర రాయొచ్చు కదా ఇది నా ఆలోచన. అది తప్పా? ఒప్పా? ఎవరిని అడగాలి? ఎవరు చెబుతారు?ఒకవేళ నాకు తెలియకుండా అలాంటి సామాన్యుడి జీవిత చరిత్ర ఎవరైనా రాశారేమోనని అన్ని గ్రంథాలయాలు చుట్టబెట్టాను. అందులో రాజకీయనాయకులు, మత ప్రవక్తలు, విప్లవకారులు, ఆధ్యాత్మికవాదుల జీవిత చరి త్రలు ఉన్నాయి. ఆఖరిగా గాడ్సే, రావణుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళ కథలూ ఉన్నాయి. సామాన్యుడి కథ మాత్రం ఎక్కడాలేదు!