బక్కచిక్కిన వ్యక్తి ఒకడు ఓ వృద్ధురాల్ని మూటలాగా వీపుమీద వేసుకుని కొండపైకి ఎక్కుతున్నాడు. తనలోతనే ఎంతో కుమిలిపోతున్నాడు. ఆ వృద్ధురాలు, అతడూ ఇద్దరూ మౌనంగా రోదిస్తున్నారు. భార్య కోరిక కాదనలేక తన తల్లిని కొండపైనుంచి లోయలోకి తోసేయడానికి తీసుకువచ్చాడా బక్కమనిషి. అతడామెను లోయలోకి తోసేశాడా? లేదా? ఆ భార్య కోరిక తీరిందా? అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది?

‘‘నాన్నా శశీ ఏరా ఇంకా కూర్చున్నావేంటి? ఆఫీస్‌కి వెళ్ళడం లేదా?’’సోఫాలో కూర్చుని ఎటోచూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్‌ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ప్రమీల.పూజగదిలోంచి హాల్లోకివచ్చి పలకరించిన తల్లినిచూసి ఉలికిపడ్డాడు శశాంక్‌. ‘‘ఆ, ఆ వెళ్తానమ్మా’’ అన్నాడు తత్తరపడుతూ.కొడుకువైపు వింతగా చూసింది ఆమె.రోజూలాగే ఇవాళకూడా ఉదయం ఐదున్నరకే లేచింది ప్రమీల. స్నానపాదులు పూర్తిచేసుకుని, కొడుక్కీ, కోడలికి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ సిద్ధం చేసింది. ఇద్దరూ ఇడ్లీ తింటూండగానే వాళ్ళ క్యారేజీలు కూడా సర్ది డైనింగ్‌టేబుల్‌ మీద వాళ్ళపక్కనే పెట్టి పూజగదిలోకి వెళ్ళిపోయింది.

తనూ, తన భర్త కలిసి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండడం ఇష్టం ఉండదు ప్రత్యూషకి. పెళ్ళైనకొత్తల్లో అత్తగారికి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేది. రెండునెలలు దాటాక ‘‘అన్నీ టేబుల్‌మీదపెట్టి మీ పని మీరు చేసుకోండి, మేం తింటాం’’ అని డైరెక్ట్‌గానే చెప్పింది.అప్పటినుంచీ కొడుకూ,కోడలు కూర్చున్నచోట ఉండకుండా ఏదో పని కల్పించుకుని అవతలికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల.ఆ ఇంట్లో రెండు ప్రదేశాలు ఆవిడ స్వంతం ఒకటి వంటగది, రెండు పూజగది. ఆ రెండు గదుల్లోకి కోడలురాదు. కొడుకు అసలురాడు. ప్రమీల పూజ కనీసం నలభైనిమిషాలు పడుతుంది. శుక్రవారం, మంగళవారం అయితే గంట సమయం పడుతుంది.అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీస్‌లకెళ్ళిపోయే కొడుకు, కోడలు కోసం టిఫిను, వంట చేసేస్తుంది. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌ తినేటప్పుడు క్యారేజీలు సర్ది వాళ్ళపక్కనేపెట్టి తను పూజకి వెళుతుంది. ఆ తరువాత ఎవరి బండిమీదవాళ్ళు ఆఫీస్‌లకెళ్ళిపోతారు. పూజ పూర్తయ్యాక తను షుగర్‌ టాబ్లెట్‌ వేసుకుని రెండు ఇడ్లీలు తింటుంది ప్రమీల.