ఉరుములు,మెరుపులతో ప్రారంభమైచెవులు చిల్లులు పడే శబ్దాలతో వడగళ్ళ వాన పడుతోంది. పోటెత్తిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది శారద మనసు. సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మ్యూజిక్‌ కాన్సర్ట్‌కి వెళ్తున్నానంటూ, హడావిడిగా కారు స్టార్ట్‌ చేసిన కొడుకు కారుణ్య గురించి ఆలోచిస్తోందామె.

మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ఎక్కడ, ఎంత దూరంలో జరుగుతోందో, ఎన్ని గంటలకు ముగుస్తుందో తెలియదు. కాన్సర్ట్‌ అయ్యాక ఇంటికి వస్తాడా? ఫ్రెండ్స్‌తో ఏ సినిమాకైనా వెళ్తాడా? అసలు మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కి వెళ్ళాడా? మరెక్కడైనా స్నేహితులతో గడుపుతున్నాడా? ఇంటికి వచ్చే వాడి ఫ్రెండ్స్‌ చెడు అలవాట్లున్న పిల్లల్లాగా అనిపించరు. కాని కనిపించేదే వాస్తవం కాకపోవచ్చు ... వీళ్ళుకాక బయట వీడికి ఎలాంటి ఫ్రెండ్స్‌ ఉన్నారో? కాలేజికి వెళ్లిన దగ్గర్నుండి ఇంటికి వచ్చేదాకా ఎవరితో స్నేహం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో!‘పిల్లల మీద నమ్మకం ఉంచాలి. ప్రతి క్షణం అనుమానపడుతూ వాళ్ళ ప్రాణం తియ్యగూడదు. నువ్విలా అనుకుంటున్నావని తెలిస్తే వాడు అవమానంగా ఫీలవుతాడు. స్వేచ్ఛగా ఎదగనివ్వాలం’టూ కొడుకు తరపున లెక్చర్‌ ఇస్తాడు రాజేష్‌.

పిల్లల్ని ఎంత స్వేచ్ఛగా పెంచాలో తనకు మాత్రం తెలియదా? కాని, టీనేజిలో వారిని వలేసి బలంగా లాగుతున్న వ్యసనాల మాటేమిటి?!సెల్‌లో వినిపించిన బీప్‌ శబ్దంతో ఉలిక్కిపడి టైమ్‌ చూసింది శారద. రాత్రి రెండు దాటింది.కారుణ్య ఇంకా రాలేదు. లేటవుతున్నప్పుడు కనీసం ఫోన్‌ చెయ్యొచ్చు కదా. ఇంటికి వచ్చేదాకా తనకు కంటి మీద రెప్ప పడదని వాడికీ తెలుసు. మొన్నటిదాకా వాడి ప్రపంచం అంతా తన చుట్టూనే. తనను విడిచి ఎక్కడకూ వెళ్ళేవాడు కాదు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడు?శారద మెదడు నిండా ఆలోచనలు.టెన్త్‌లో ‘యాపిల్‌’ ఫోన్‌ కొనమని మారాం చేసి కొనిపించుకున్నాడు. ఇంటర్‌లో ఖరీదైన బైక్‌ కోసం టెండర్‌ పెట్టాడు. బైక్‌ డ్రైవింగ్‌ అంటే హడల్‌ రాజేష్‌కి. ఎలాగో సర్ది చెప్పి కొడుకుని ఒప్పించగలిగాడు కాని మరో ఆరు నెలలకే మళ్లీ కారు కొనమని మొదలెట్టాడు. ‘కారు కొనే స్తోమత లేదు ... అర్థం చేసుకో’మని నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు కాని, వాడి మంకు పట్టు చూసి ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయపడ్డాడు. చివరకి కారు కొనక తప్పలేదు రాజేష్‌కి.