కృష్ణవేణి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోయింది. కళ్లలో నీళ్ళు ఇంకిపోయాయేమో, నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. యాభై ఏళ్లు తన జీవితాన్ని పంచుకున్న భర్త తనను వదిలి వెళ్ళిపోయాడు. తనకు ముగ్గురు పిల్లలను ప్రసాదించి తననేనాడూ కష్టపెట్టని భర్త తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి తన పరిస్థితి ఏమిటి?

ముందు ముందు తన జీవితం పరాధీనమేనా? కూతుళ్లు ఇద్దరూ, వారి వారి సంసారాల్లో మునిగిపోయి ఉన్నారు. తనని తీసుకెళ్లినా ఓ పది రోజులు తమ ఇంట్లో ఉంచుకోగలరేమో! అంతకంటే స్వతంత్రులు కారు వాళ్ళు. ఇద్దరివీ ఉమ్మడి కుటుంబాలే!కొడుక్కి ఉద్యోగం ఉంది. వాడికి ఎంత వస్తుందో తెలియదు. ఇద్దరు పిల్లలతో ఉన్న వాడికి తాను భారం కాబోతుంది.భర్త ఉన్నన్నాళ్లూ తను పూజలూ, వ్రతాలూ, వంటలూ తప్పించి, ఏ విషయమూ పట్టించుకోలేదు. ఇప్పుడు జీవితం అంటే భయమేస్తోంది.మైలదినాలు అయిపోయాయి. అన్ని కర్మకాండలూ పూర్తయ్యాయి.

ఓ రోజు కృష్ణవేణి అన్నగారు వచ్చి ఆవిడతో, ‘‘అమ్మా! ఓ సారి పుట్టింటికి వచ్చి కొత్త బట్టలు కట్టుకుని రావాలి! అది మన పద్ధతి! రేపు బయల్దేరుదాం, సరేనా!’’ అన్నాడు.అన్నగారి దగ్గర ఉన్నప్పుడు మేనల్లుడు గోపి ‘‘మామగారి అంత్యక్రియలకు ప్రభుత్వం పదివేలు ఇచ్చింది. పైన కొద్దో గొప్పో పడి ఉంటుంది అత్తా! నీకు ఫ్యామిలీ పెన్షన్‌ వస్తుంది. నువ్వు ఎవరిమీదా ఆధారపడనవసరం లేదు.’’ చెప్పాడు.కృష్ణవేణికి వింతగా అనిపించింది.‘‘తనతో హరి ఏం చెప్పలేదే...? పైగా తనకు పెన్షన్‌ వస్తుందా?’’ అంతా అయోమయంగా ఉంది కృష్ణవేణికి.