‘‘నీకెందుకిదంతా? నీపనేదో నువ్వు చూసుకోక ఊరి వ్యవహారాల్లో తలదూర్చటం ఎందుకు?’’ ఆఫీసర్‌ మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగానే ఆయన వైపు చూశాను. ఈ ప్రశ్న నేనెదుర్కోవటం మొదటిసారి కాదుగా, సమాధానం చెప్పటానికి! అందుకే ఆయన కొంచెం చిరాకు తగ్గించుకుని నావైపు సానుభూతిగా చూసి ‘‘సరేలే పద, నీపని తొందరగానే అవుతుందిలే’’ అన్నారు.ఎం.ఆర్‌.ఓ. ఆఫీసునుండి బైటపడి ఇంటిదారిపట్టిన నా మనసునిండా ఆలోచనలే. మా ఊరి హైస్కూలు పక్కన ఉన్న రెండెకరాల ఖాళీజాగాని ఒక రాజకీయనాయకుడి అండతో కొందరు ఆక్రమించి, ఇళ్ళస్థలాలుగా చేసి అమ్మే ప్రయత్నాన్ని నేను అడ్డుకున్నాను. మా ఊరు యువకులతో కలిసి ధర్నాకు దిగాను. అది ఎవరికీ చెందినదికాదు, ప్రభుత్వ భూమేనంటూ సర్వే చెయ్యాలని అర్జీ పెట్టాను. అప్పటినుండి ఎందరో నాయకులు, అధికారులనుండి ‘నీకెందుకూ..’’ అనే ప్రశ్న ఎదుర్కొంటూనే ఉన్నాను.‘నీ సొంత భూమిలోకి ఎవరైనా అడుగుపెడితే, అప్పుడడుగు. అంతేగానీ ఊరికి చెందిన భూమి గురించి నీకెందుకూ...!’ అనడుగుతారు. అదేమిటో నాకర్థం కాదు! మా ఊరికి చెందిన విలువైన ఆస్తి అన్యాక్రాంతమైపోతోందంటే, నాకు ఎందుకని నేను ఊరుకోవాలా? పౌరుడిగా నాకు బాధ్యత ఉండదా! ఆఫీసులచుట్టూ తిరుగుతూ, ఎంతమంది ఆఫీసర్లకు ఎన్నిసార్లు నా వాదన వినిపించానో..!చిన్నప్పటినుండి ‘ఎందుకూ... నీకెందుకూ..’ అని నేనెదుర్కొన్న కొన్ని సందర్భాలు నా మనసులో మెదిలాయి.నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు సెలవులకు ఒకసారి తాతగారి ఊరు వెళ్ళాను. పక్కింటి పిల్లలిద్దరితో ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లల నాన్నవచ్చి ట్యూషన్‌కి టైమైందని తీసుకెళ్తుంటే, తాతగారు ‘ఇక్కడున్న నాలుగు రోజులూ నువ్వూ, వాళ్ళతోవెళ్ళి కాసేపు పాఠాలు వింటూ ఉండరా..’’ అన్నారు, సరేనని ఉత్సాహంగా వెళ్ళాను.

వరుసగా మూడురోజులు వెళ్ళినా ఆ పంతులుగారు పాఠం చెప్పేదేం నాక్కనిపించలేదు. వాళ్ళింటి అరుగుమీద మేం కూర్చోగానే ‘‘పుస్తకాలు తీసి చదవండిరా’’ అనేవారు. వీధిలో వెళ్తున్న వాళ్ళెవరినో ఆపి, నిలబడే ఏదో మాట్లాడటం.. ‘ఏమండీ’ అని వంటగదిలోనుండి ఓ గావుకేక రాగానే లోపలికెళ్ళి వంటపనిలో సాయంచేసి రావటం... ఇదే తంతు! ఇక పిల్లలిద్దరూ నోటు బుక్కుల్లో ఏవో గీతలు గీసుకుంటూ సరదాగా కబుర్లతో కాలక్షేపం చేసి టైమవ్వగానే పుస్తకాలు సర్దేసుకుని బయలుదేరటం.. అంతే!