హోంవర్క్‌ చేయలేదని రోజంతా తిండిపెట్టకుండా పిల్లల్ని గదిలో బంధించేస్తాడా? ఇంత దుర్మార్గపు తండ్రి ఎక్కడా ఉండడు! పాపం పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే చదువుకోమంటాడా? ఇదేంపిచ్చి! నిజంగా అతనొక తండ్రేనా? పక్కింట్లో తండ్రి చేస్తున్న బాగోతం విని తీవ్రమైన ఆగ్రహం వచ్చిందతనికి. ఆ తండ్రికి బుద్ధిచెప్పాల్సిందే అని వాళ్ళింకెళ్ళాడు. అతను వెళ్ళి ఏం చేశాడు? ఆ తండ్రిని కొట్టాడా?

‘‘సార్‌! ఈ రోజు నా పుట్టిన రోజు. పనుల కారణంగా ఈ ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. మా ఊళ్ళో అయితే కుటుంబసభ్యులతో సరదాగా పార్టీ చేసుకునేవాణ్ణి. మరి ఇక్కడ మీరే నాకు ఆప్తులు. అందుకని ఈ ఈవినింగ్‌ మీకు, మీ ఫ్యామిలీకి హోటల్‌ తాజ్‌లో డిన్నర్‌ ఇవ్వాలనేది నా కోరిక. మీరు రావాలి. కాదంటే నామీద ఒట్టే!’’ అతని కళ్ళలో ఆత్మీయతతో కూడిన అభ్యర్థన.ఆశ్చర్యంతో చూశాను. ఏం మాట్లాడలేకపోయాను. ఓ నాడు నేనన్న మాటలే అవి ఓ విచిత్ర విషాద సందర్భంలో.ఏనాటి పరిచయం మాది!! రెండు దశాబ్దాలు దాటింది. అప్పుడు నా వయసు ఇరవై నాలుగు. అతను నాకంటే బాగా చిన్నవాడు. పదేళ్ళ వాడేమో! ఇన్నాళ్ళకు చెయ్యెత్తుమనిషిగా ఎదిగి తన కంపెనీ రిప్రజెంటేటివ్‌గా టిప్‌టాప్‌గా తయారై, ఈ ఊళ్ళో మా ఆఫీసుకి అతను రావడం...తనే నన్ను గుర్తుపట్టి పాతపరిచయం గుర్తుచేసి, ఇలా ఇంత ఆత్మీయతతో ఆహ్వానం పలకడం...!!? చాలా విచిత్రంగా అనిపించింది.

‘‘ఏంసార్‌? ‘రాను’ అని చెప్పడానికి ఏం సాకు చెప్పొచ్చా అని ఆలోచిస్తున్నారా?’’ అంటూండగా అతని కన్నుల్లో కృతజ్ఞత నిండిన పల్చటి నీటి తెర. ‘‘ఆరోజు మీరు చేసిన ఆ సాయం...అఫ్కోర్స్‌ మీ దృష్టిలో అతి అతిచిన్నదే కావొచ్చు. కాని నన్ను, మా అన్నయ్యనీ ఆ చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయి జీవితాలు నాశనం చేసుకోకుండా కాపాడింది సార్‌ అది. నిజం’’ అతని గొంతు తడిబారుతూ నిజాయితీతో వణికింది.అతని ముఖంలోకే చూస్తున్నాను. అతని చూపుల్లో అదే అభ్యర్థన. నా గతం తాలూకు ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ రెండు దశాబ్దాలు వెనక్కిపరుగెత్తాయి.