ఎట్టకేలకు కరటకం ఆఫీసరయ్యాడు!మిగిలిన సర్వీసు రెండేళ్ళే. అదిచాలు అధికారిగా ఆధిపత్యం అనుభవించడానికి అను కున్నాడు. నిలువెల్లా అహంభావం నింపుకున్నాడు. మంచితనం, మానవత్వం అన్నపదాల్ని పాదాలకింద తొక్కేశాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే కరటకం కర్కోటకం అయ్యాడు!కరటకానికి రెండు క్షణాల్లా, సిబ్బందికి రెండు యుగాల్లా కాలం ముగిసింది!అంటే రిటైరయ్యాడన్న మాట!సభ చేసినవాళ్ళు లేరు, వీడ్కోలు పలికినవాళ్ళు లేరు. ఎవరు విసిరేశారోగానీ వాడినపూలు వీడిన దండొకటి వీపుకి కొట్టుకుంది. మాడిన మాడుతో ఇంటికొచ్చిన మర్నాడు పేపరుచూస్తే, పదవీవిరమణ వయసు పెంచుతూ ప్రభుత్వంచేసిన ఆదేశాల ప్రకటన చూశాడు. ఒక్కరోజులో ఆ అవకాశం కోల్పోయాడు. ఎవరో కాళ్లూ చేతులూ కట్టేసి ఒంటిమీదకి తేళ్లూ పాములు వదిలిపెట్టినంత బాధపడ్డాడు. కుమిలిపోయాడు. కుప్పకూలాడు!

నలుగురిలోకి వెళ్తే చీదరింపులు ఛీత్కారాలేతప్ప ఆదరంగా పలకరించే మనిషంటూ దగ్గరికి రావడం లేదు. జనజీవనంలో తలెత్తలేక ఇంటిగోడలకే బల్లి అయ్యాడు. భార్య ఊరడించ బోయింది. ‘‘వంటవార్చు ఓదార్చకు’’ అని విసిగాడు. మానసిక వైకల్యం చోటు చేసుకుంది. ఏదోఒకటి భర్త ఇంటిపట్టునే ఉంటాడనుకున్న భార్య ఆనందవల్లి జీవితం విషాదం అయిందనే చెప్పాలి, ఎందుకంటే, కరటకం జాంకాయలాఫీసరయ్యాడు!భర్త మనస్థిమితం కోల్పోయాడని తొందరపడి నలుగురితో చెప్పేట్లు లేదు!

చెదిరిన భర్త ప్రవర్తనకు బెదిరిన ఆనందవల్లి దూరపు చుట్టమైన డాక్టరు చ్యవనప్రాసతో తన గోడు చెప్పుకుంది. ‘‘ఈ వ్యాధికి మందు నాదగ్గర లేదు. డాక్టరు పట్టు పీతాంబరం అని ఓ కుర్ర సైక్రియాటిస్టు. ఆ వైద్యంలో మంచి పట్టున్నవాడు’’ అని చెప్పి చిరునామా ఇచ్చాడు చ్యవనప్రాస.పిచ్చి అనే రాయి భర్తచేతిలో ఉంది! వైద్యుణ్ణీ రోగినీ ఒక దగ్గరికి తీసుకువచ్చే దారీ తెన్నూ తోచక అలమటిస్తున్న ఆనందవల్లికి కొండంతధైర్యంగా తమ్ముడు ఉత్తానపాదం వచ్చాడు. అక్కాబావల్ని పండక్కి పిలవడానికి!