అతని ముగ్గురు పిల్లలూ సెటిలయ్యారు. రిటైరై ఫ్రెండ్స్‌, యోగాలతో హ్యాపీలైఫ్‌ గడుపుతున్నాడు. ఆకస్మికంగా పొలం, స్థలాలమ్మేసి కొడుకులకి, భార్యకి సమానంగా పంచాడు. ఆనక మెల్లిగా భార్యకు చెప్పాడు మూడునెలలు హిమాలయాలకు వెళ్ళొస్తానని. ససేమిరా ఒప్పుకోలేదామె. ఎలాగో ఒప్పించాడు. కానీ ఆ మూడునెల్లూ మూడుక్షణాల్లా గడిపిందామె! మరి అతనికి...? అతనెలా ఫీలయ్యాడు? ఏమని డిసైడయ్యాడు?

పార్క్‌లో యోగా చేస్తున్నానేగానీ నా మనస్సు నిలకడగా లేదు. అస్సలు నిలకడ లేనిదేగా మనస్సంటే! నా నలభైయ్యేళ్ళ కష్టార్జితం తెగనమ్మి నేనిలా నా ఇద్దరు కొడుకులకీ, కూతురికీ పంచేయటం నా మిత్రత్రయానికి విడ్డూరంగా తోచింది.‘‘నీ పిల్లలందరూ ఆర్థికంగా బాగా స్థిరపడినవాళ్ళే! నువ్వా, అరవైదాటినా దుండుముక్కలా ఆరోగ్యంగానే ఉన్నావ్‌! అదీగాక విజయవాడలో స్థలాలరేట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయ్‌! నువ్వెందుకీ నిర్ణయం తీసుకుంటున్నావో మాకు పాలు పోవటం లేదు’’ ఆనాటి సాయంకాలం పార్కు సమావేశంలో నా ఆప్తమిత్రులు ముగ్గురూ తెగబాధపడ్డారు.

చెప్పాలంటే మా ముగ్గురిస్నేహం ముప్ఫైసంవత్సరాల పైమాటే! మా కష్టసుఖాల్లో నలుగురం మంచం కోళ్ళలాగా కలిసే ఉన్నాం! వాళ్ళకి నా ఆంతర్యమేమిటో తెలియజేయాలి మరి!‘‘నేను బ్రతికుండగానే నా కష్టార్జితాన్ని నా పిల్లలు ఆనందంగా అనుభవించటం నా కళ్ళతో నేను చూడాలిరా! ‘మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి’ అని వాళ్ళు గర్వంగా అనుకోవాలి! అప్పుడే నాకూ తృప్తిమిగుల్తుంది’’ భావోద్వేగంతో అన్నాను.నా మనస్సులో చాలా ఆలోచనలున్నాయ్‌! వాటిని త్వరగా అమలుచేయాలి. ఇంకెంతకాలం బ్రతుకుతానో? జీవితం అన్నాక ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుందా? ఇంతకాలం సౌకర్యంగా బ్రతకటానికి ఏర్పాట్లున్నాయి.

ఇహ నేను పోయినా నా భార్య పార్వతి ఏ లోటూ లేకుండా జీవితాన్ని ఎదుర్కోటానికి ఏర్పాట్లుచేయాలి!రోజూకన్నా పావుగంట ముందుగానే ఇంటిముఖం పట్టాను. లోపలికి వెళ్ళగానే పార్వతి లేచి గ్లాసుతో మంచినీళ్ళిచ్చింది. అది తన అలవాటు! నేను కూడా అవసరం లేకపోయినా రెండు గుక్కలు మంచినీళ్ళు తాగుతాను. నా అలవాటది!ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఉన్న నా మొహంలోకి పరీక్షగా చూస్తూ ‘‘కాస్త అన్నం వండనా... లేదా టిఫినా?’’ అడిగింది. ‘‘నా కోసం ప్రత్యేకంగా వండొద్దు. నేనూ నీతోపాటు పాలల్లో ఓట్స్‌ వేసుకుని తింటాలే!’’ నా గొంతులో ప్రేమ!