ఆమె పేరు రాజేశ్వరి. చలం ‘మైదానం’ రాజేశ్వరి అనుకునేరు. కానేకాదు. చలంరాజేశ్వరికి పెద్ద పొట్ట ఉన్న భర్త ఉన్నాడు. అయినాగానీ విశాలమైన మైదానంకోసం ఆమె లేచిపోయింది. కానీ ఈ రాజేశ్వరి ఆ రకంకాదు. పెళ్ళైవుంటే ఎంతపెద్ద బానపొట్ట ఉన్న భర్తనైనా వదిలెళ్ళి ఉండేదికాదు. ఎందుకంటే ఈ రాజేశ్వరికి పెళ్ళి ఓ కల. సంసారం ఓ కల. కానీ చిత్రమేంటంటే చలం రాజేశ్వరిలానే ఈమె కూడా లేచిపోయింది! కానీ....!

ఒక గది.ఎంత పరిచితమో అంత పరాయి.ఎవరెవరో వచ్చి వెళతారు. వచ్చినప్పుడు నాకు నేను కాను.ఎవరూ రానప్పుడు ఎవరో రావాలని ఎదురు చూస్తాను. ఎదురు చూడడం వ్యాపారం. ఎదురుచూపు ఫలించాక నాకు నేను కాకపోవ‍డ‍ం కూడా వ్యాపారమే.నాకు నేనే నా నేను కాకపోతే, ఈ గది నాదవుతుందా? ఇదెప్పుడూ పరాయిదే.వచ్చినోళ్లకు కాసేపు నేనొక కొండకొమ్మును. గిరి శిఖరాన్ని. వచ్చినోళ్లు నా శిఖరాలు లోయల మీదుగా తమ నరాల తాళ్లువేసి పాకుతారు. గోళ్ల పికాసులను కొండకు గుచ్చి వ్రేలాడుతూ పడి పోతామని భయపడతారు. భయపడుతూ పైకి పాకుతారు. ఆయాసపడతారు. చెమట‍ చెమ‍ట‍ బుర‍ద‍ బురద అవుతారు. తమ బురదలో తాము కాలేసి జారి పడతారు. కొందరు పైకెక్కి జెండాలు ఎగరేస్తారు.

చిరిగిన జెండాలు.వాళ్ళు జెండాలెగరేసిన చోట్లు, ఊపిరి ఎగపోసిన చోట్లు, అవి జీవితాలు కాదు, హత్యలు. ఆనవాళ్లు లేని హత్యలు. అవి హత్యలనే ఆనవాళ్ళు కూడా లేని హత్యలు. తమ మీద రక్తం మరకలు లేకుండా తుడుచుకుని వెళిపోతారు, చీకటి మూలల్లోనికి బొద్దింకల్లా.చాల కాసేపయింది. ఎవడో వచ్చి  వెళ్లాడు. వాడి ముఖం గుర్తులేదు. నా ముఖం అటు తిప్పుకున్నాను. ఏదో చెడ్డవాసన. వాసన ముక్కుకు సోకడమే కాదు. కళ్ళకు కనిపించింది కూడా.వాడెళ్లాడు.మళ్లీ ముఖం కడుక్కున్నాను,. మళ్లీ పౌడరేసుకున్నాను. వచ్చి వెళ్లినవాడు వదిలివెళ్లిన మసక వాసనలు తెలీకుండా ఘాటైన సెంటు చల్లుకున్నాను.ఎప్పుడూ ఇంతే. ఏదో వాసనలు మోస్తుంటాను. ఎప్పుడూ ఎవరిదో ఒకరి వాసనను. ఎప్పుడో భవిష్యత్తులో నలుగురు మనుషులు నన్ను మోస్తున్నప్పటి వాసనను కూడా మోస్తుంటాను. నేను జీవిస్తున్నాను అనడంతప్పు. నేను మరణిస్తున్నాను.