భార్య చెప్పిన మాటలు విని ఆ భర్త సందేహంలో పడ్డాడు. తన కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ విషయం నిర్థారించుకోవాలనుకున్నాడు. అంతలోనే పోస్టులో ఏవో కాగితాలొచ్చాయి. ఆ కవరు చించి చూశాక అతడి అనుమానం బలపడింది. నేరుగా కొడుకు దగ్గరకు వెళ్ళి ఆరాతీశాడు. కొడుకు ముభావ ప్రవర్తనతో అతడికి విషయం స్పష్టమైంది. దాంతో అతడు మర్నాడు ఒకచోటకు వెళ్ళి ఇంక్వైరీచేసి ఒక నిర్ణయానికి వచ్చేశాడు.

జగన్నాథశాస్త్రి ఏమీ తోచక నడవాలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. రిటైరై ఆరునెలలు కావస్తోంది. ఉద్యోగానికి వెళుతున్నన్ని రోజులూ సమయం ఎలా గడుస్తోందో తెలిసేది కాదు. కళ్ళుమూసి తెరిచేలోగా గంటలు, రోజులు మాయమయ్యేవి. ఇప్పుడు నిముషం గడిచేందుకే గగనంగా ఉంది.అబ్బాయి వ్యాస్‌ ఉదయమే ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కొత్త కోడలు ఇంట్లో సర్దుకుపోయేందుకు అలవాటు పడేలోపే పుట్టింటికి వెళ్ళాల్సివచ్చింది. అమ్మాయికి ఐదో నెల రాగానే తల్లిదండ్రులు వచ్చి ఆమెను తీసుకువెళ్ళారు. అబ్బాయికి పెళ్ళై ఏడాది కావస్తోంది.భార్య సుగుణ కాఫీతో వచ్చింది. ఏమీ తోచక అతనలా పచార్లు చేస్తూండడం చూసి చిన్నగా నిట్టూర్చింది. తన మనసులో మాట చెప్పాలావద్దా అనే ధర్మసందేహంతో కాఫీ గ్లాసు కాస్సేపు చేతిలోనే ఉంచుకుని తలపటాయించింది. తన నడకలో వెనుదిరిగిన వెంటనే కనబడిన భార్యను, ఆమె చేతిలోని కాఫీని చూశాక అతనిలో కొంత కొత్త ఉత్సాహం పొడసూపింది. నడక వేగంపెంచి కాఫీ అందుకున్నాడు. అది చేతిలోకి రాగానే ఎనర్జీ డ్రింక్‌ దొరికినట్టనిపించింది.కాఫీ ఇచ్చేసి ఇంకా అక్కడే నిలబడి ఉన్న భార్య వంక ప్రశ్నార్థకంగా చూశాడు.‘‘ఏదో చెప్పాలనుకుంటున్నావు?’’‘‘అదే...ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను’’‘‘నలభై ఏళ్ళు తోడుగా ఉన్నావు. ఇంకా తలపటాయింపేనా?’’భృకుటి ముడి వేసింది చిరుకోపంతో. ‘‘ప్రస్తుత సమస్య వేరు’’ అంది.సమస్య అన్న పదం వినగానే నిదానం అయ్యాడు. ఇన్నేళ్ళుగా ఏనాడూ ఆమె నోట సమస్య అన్న మాట విని ఎరగడు. ఒకవేళ విన్నా చాలా అరుదు.‘‘సమస్యా? ఏమిటది?’’‘‘మన అబ్బాయి ఈ మధ్య ఎందుకో చాలా ముభావంగా అంటీ ముట్టనట్టు ఉంటున్నాడు. దాదాపు ఆర్నెల్లుగా గమనిస్తున్నాను’’ అంటూ ఆపింది సుగుణ.