మనవైన కుటుంబ బంధాలకోసం మనసెప్పుడూ తహతహలాడుతుంది. తాతయ్యలు, అమ్మమ్మలతో పంచుకున్న సంతోషాలూ, బాల్యానుభూతులు జీవితాంతం మన హృదయాల్లో పదిలంగా ఉండిపోతాయి. అది ఎప్పటికప్పుడు మనల్ని రీచార్జ్‌ చేసే టానిక్‌లా ఉపయోగపడుతుంది. మరి ఆ అనుభవాల్ని, ఆ విలువల్ని వచ్చేతరంవాళ్ళకి కూడా అందించే బాధ్యత మనకు లేదా? అని సందిగ్ధంలో పడింది ఈ కథలో కీర్తి. మరి ఆమె ఏం చేసింది?

–––––––––––––––––––––––

భారతికి నాలుగోసారి మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు.భర్త రామకృష్ణతో కలిసివెళ్లి రెండురోజుల క్రితమే కూతుర్ని కాన్పుకి తీసుకొచ్చింది. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. కీర్తి, చందు. రామకృష్ణ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఆఫీసర్‌గాచేసి రిటైరయ్యారు. అప్పటికే ఇద్దరి పిల్లలకి వివాహాలు జరిపించేశారు. కీర్తి, ఆమె భర్త విజయ్‌ చెన్నైలో స్థిరపడ్డారు. వారికి ఒక బాబు. ఇప్పుడు రెండోమారు తల్లి కాబోతోంది. చందు అతని భార్య ఉష ఇద్దరికీ బెంగుళూరులో ఉద్యోగాలు. వారికి ఇద్దరు పిల్లలు. ముందు బాబు తర్వాత పాప. తండ్రి రిటైరైననాటినుండి తన దగ్గరికి వచ్చేయమని పోరుపెడుతూనే ఉన్నాడు చందు. కానీ ఉన్న ఊరునీ, సొంత ఇంటినీ, స్థానికంగా ఉన్న బంధువులు, స్నేహితులందరినీ వదిలి వెళ్ళడం అంటే ఆషామాషీ వ్యవహారంకాదు. కొడుకు మాటలకి అదుగోఇదిగో అంటూనే కాలం గడిపేస్తూ వస్తున్నారు రామకృష్ణ దంపతులు. ఎప్పుడో ఓసారి బుద్ధిపుట్టినప్పుడు కూతురు దగ్గర కొన్నాళ్ళు, కొడుకుదగ్గర కొన్నాళ్ళు గడిపిరావడంతప్ప పిల్లలందరితో కలిసి తన ఇంట్లో ఓ సంక్రాంతి వేడుకను కూడా జరుపుకుని యెరగదు భారతి. ఆమెకు ఇదొక తీరని కోరికగా ఉండేది. ప్రస్తుతం కూతురు, మనవడి రాకతో ఇల్లు సందడిగా ఉన్నది ఇంట్లో.సాయంత్రం వంటకి అన్నీ సిద్ధం చేసుకుంది భారతి. కీర్తి వరండాలో కూర్చుని ఉంది.

తను కూడా కూరలు అక్కడికే తెచ్చుకుని తరగసాగింది భారతి. రామకృష్ణ మనవడిని కాలనీలో ఉన్న పార్కుకి తీసుకెళ్ళారు. వరండాలోంచి చూస్తే పార్కు బాగా కనబడుతోంది. ‘‘ఇదివరకటికన్నా బాగా డెవలప్‌చేశారమ్మా పార్కు, మా చిన్నతనంలో ఇన్నిలేవు’’ అన్నది కీర్తి. భారతి కూడా అటే చూస్తూ, ‘‘కాలంఎంతవేగంగా కదులుతోందోనే అమ్మడూ, నిన్నకాక మొన్న నువ్వు, చందు, కుమారి పిన్నిపిల్లలందరూ కలిసి తాతయ్యతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది నాకు నాన్నని నీ కొడుకుతో చూస్తుంటే’’ అంటూ ఓ పెద్ద నిట్టూర్పు విడిచి తరిగిన కూరలు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది.