ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఒలికిన నీళ్లు... కంచం విసిరెయ్యగా ఇల్లంతా చిందిన ఎంగిలి మెతుకులు... నేలను అతుక్కున్న కూరముక్కలు... తివాచి వరకు జారిన సాంబారు... ఎప్పటిలా ‘మళ్లీ ఈయనగారికి కోపం వచ్చింది. లేచి ఇల్లు తుడుచుకోవాలి’ అనుకోలేకపోయింది. ‘అతగాడు విసిరేయడం ఎంత సామాన్యమో తాను ఇల్లు తుడుచుకోవడం అంత సాధారణం’ అనుకుని కొంగు బిగించి పనిలో పడలేకపోయింది. మనసులో ఏదో హోరు. ఈ చిరాకుల నుండి బయటపడాలన్న ఆరాటం. అలవాటుపడ్డ ధోరణి నుండి ఎదురు తిరగాలన్న వైఖరి తలెత్తుతున్నది. చెప్పలేని ఉక్రోషం. కన్నుల నుండి బయటకురాని దుఃఖం మనసును నలిబిలి చేస్తున్నది. చాలాసేపు అలా కుర్చీలో నిస్సత్తువగా కూర్చుండిపోయింది.

అంతలో పక్కింటి భాస్కర్రావు బాబాయిగారికి భోజనం పెట్టిరావాలని గుర్తుకొచ్చింది. అకస్మాత్తుగా పక్కూరికి వెళ్లాల్సి వచ్చిన విశాలగారు సాయంత్రానికల్లా వచ్చేస్తాను, కాస్త మా మామగారికి భోజనం పెట్టమని మరీ మరీ చెప్పి వెళ్లింది. ఆ మెతుకుల మధ్య నుండే నడిచి వెళ్లి ఒక గిన్నెలో కొద్దిగా సాంబారు, కూర తీసుకుని పక్కింటికి వెళ్లింది.‘‘సారీ బాబాయ్‌గారు, పనుల్లో పడి ఆలస్యమైపోయింది. మీరు భోజనం చేసెయ్యండి’’ అంటూ భోజనం పెట్టింది. ‘‘ఫరవాలేదమ్మా. పనా, పాటా..! ఆకలిగా ఏమీ లేదు’’ అన్నారు. అతనితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ దగ్గరుండి వడ్డించసాగింది. ఇంతలో పక్కనే ఉన్న పోర్షన్‌ నుండి పెద్దగా అరుపులు వినబడసాగాయి.‘‘యూ ఫూల్‌..! నీకు పెళ్ళానికి ఒంట్లో బాగుందో లేదో అక్కరలేదురా.. నా డబ్బులు కావాలిగాని, నా గురించి పట్టదురా..’’ ఆమె గట్టిగట్టిగా అరుస్తున్నది.

‘‘అసలు నీకు ఎంతచేసినా ఇంతేనే... ఇలాగే అరుస్తూనే ఉంటావు. వట్టి ఇడియట్‌వి.’’‘‘నీకు ఇగో ఎక్కువరా రాస్కెల్‌’’ అని ఆమె, ‘‘నీకు ఒళ్లంతా బద్ధకమే నీ ఎంకమ్మ’’ అని అతను... వాళ్లెందుకు అరుచుకుంటున్నారో గానీ, వినేవాళ్లకు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు.భాస్కర్రావుగారు ‘‘వారానికి రెండు మూడు రోజులు మాకు ఇది అలవాటయిపోయిందమ్మా. చూడచక్కని జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొదట్లో అతను అటు వెళ్లగానే ఈమె ఇటు ఫోన్‌లో అతనితోనే మాట్లాడుతుండేది. ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా అంతసేపు మాటలు ఎక్కడనుండి వస్తాయో...? అనుకునేవాడిని. వాళ్లిద్దరి పనివేళలు వేరు. ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తూ గడిపేవారు.

కలవగానే గుమ్మం దగ్గర నుండే హగ్గులు, హాయ్‌ డార్లింగ్‌ లాంటి పలకరింపులు ఉండేవి. వెళ్లేటప్పుడు ఫ్లయింగ్‌ కిస్‌లు, టాటాలు ఉండేవి. ఫోన్‌లో కూడా ఇద్దరూ ఒకటే గుసగుసలు పోయేవారు. అప్పుడు వాళ్లు దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నా, వాళ్ల మనసులు సన్నిహితంగా ఉండేవి. కాబట్టి ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినబడేవి. ఇప్పుడు ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నా వారి మనసుల మధ్య అంతరం పెరిగిపోయి పెద్దగా అరుచుకుంటున్నారు’’ భాస్కర్రావుగారు చెబుతుంటే విస్తుపోయి వింటున్నది అలివేణి. ఎంతబాగా చెప్పారు.