ఒక రోజు ఉదయం కోర్టు బయట పెద్ద గలాటా జరుగుతోంది. ఆ సమయంలో నేను నా పనిలో తలమునకలై ఉన్నాను. బయటి నుంచి వినిపించే అరుపులు నా పనికి అంతరాయం కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బందిని పిలిచి విషయమేమిటో కనుక్కుని రమ్మన్నాను. సార్జంట్‌ బయటికి వెళ్ళొచ్చి కొందరు నల్లజాతి వాళ్ళు గుంపుగా వచ్చారనీ, నన్ను కలిసి ఏదో వినతిపత్రం ఇస్తామని గొడవ చేస్తున్నారనీ చెప్పాడు. విషయమేదో తెలుసుకుని పంపిస్తే సరిపోతుంది కదా గొడవెందుకూ? అని అనిపించి వారిలో ముఖ్యమైన ఇద్దరిని లోపలికి పంపించమన్నాను. 

వాళ్ళు గనుక స్వాహిలీ భాష మాట్లాడే వాళ్ళయితే, వారితో పాటు ఒక అనువాదకుణ్ణి కూడా పంపించమన్నాను.రెండు నిమిషాల వ్యవధిలో ఇద్దరు లోపలికి వచ్చారు. వారిలో ఒక మధ్య వయస్కురాలు ఉంది. ఆమె థాంప్సన గురించి కొన్ని విషయాలు చెప్పింది. తాను వితంతువునని, తనకు ఒక కొడుకు ఉన్నాడని, వాడు థాంప్సన ఇంట్లో పని కుర్రాడనీ చెప్పింది. థాంప్సన తన కొడుకుని తుపాకితో కాల్చి చంపాడనీ, తను దిక్కులేనిదాన్నయిపోయాననీ, న్యాయం చేయమనీ ఏడ్చింది. ఇవన్నీ అనువాదకుడి సహాయం వల్ల తెలుసుకోగలిగాను.‘‘వెంటనే పోలీసులకు తెలపాల్సిన విషయం కదా ఇదీ?’’ అన్నాను. పోలీసులకు తెలిపారని, వారేమీ చేయలేకపోయినందువల్లనే వాళ్ళు నా దగ్గరికి వచ్చారని అన్నాడు అనువాదకుడు.జార్జి థాంప్సన మామూలువాడు కాదు. బులవాయోలో ప్రముఖ యూరోపియన వ్యాపారి. ధనవంతుడు. పొగాకు తోటల అధిపతి. అంతటి వాడిపై అభియోగమా? నమ్మలేకుండా ఉంది. అయినా వచ్చిన వారికి నమ్మకం కలిగించి పంపించడం న్యాయమూర్తిగా నా ధర్మం కాబట్టి, ‘‘తప్పకుండా విషయం పరిశీలిస్తానని... ఎంత వారినైనా చట్టం వదిలిపెట్టద’’ని సాంత్వన కలిగించే మాటలు చెప్పాను.

పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్న ఆమెను ఓదార్చమని... నా సిబ్బందికి చెప్పి పంపించాను.‘జార్జి థాంప్సన తన ఇంట్లో పనిచేసే కుర్రాడిని తుపాకితో కాల్చి చంపడమా?’ ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. పని కుర్రాణ్ణి చంపవల్సిన అవసరం అంత పెద్దమనిషికి ఎందుకొస్తుంది? థాంప్సన ధనవంతుడే కాదు, రొడీషియా (నేటి జింబాబ్వేకు పాత పేరు) ప్రముఖ వ్యక్తుల్లో ఆయనొకడు. ఉదార స్వభావం కలవాడు. మతమన్నా, దేవుడన్నా ఎంతో విలువిస్తాడు. కళలన్నా, సమాజసేవన్నా పడి చస్తాడు. గొప్ప గాయకుడు, మంచి రొమాంటిక్‌ ఫిగర్‌! తన వాళ్ళన్నా, తన జాతి వాళ్ళన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఇతరులను ద్వేషించడు. ఎంతోమంది నల్లజాతి వారికి పని కల్పించాడు. నల్లజాతి కుర్రాళ్ళను స్వయంగా తన ఇంట్లో నియమించుకున్నాడు కూడా!