అప్పటివరకు ఇంటి పెత్తనం సాగించిన అత్తగారు పోయింది. ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయింది . ఆ కోడలికి మనసు ఎంతో వెలితిగా మారింది. అత్తగారు పోయేముందు ఒక ఉత్తరం కోడలిచేత రాయించింది . మరో ఉత్తరం తనే రాసి సీల్‌చేసింది. తాను పోయాక ఆ ఉత్తరాలు కన్నకొడుక్కి ఇచ్చే బాధ్యత కోడలికే అప్పగించింది. మరి ఆ ఉత్తరాలు తన భర్తకు ఇచ్చిందా? ఇంతకీ ఆ ఉత్తరాల్లో అత్తగారు ఏం రాసింది?

సూర్యుడు అస్తమిస్తున్న వేళ!ఆకాశం ఎర్రగా కందిపోతున్నది.గోదావరి ఉరుకులూ పరుగులూ తగ్గించి నిదానంగా సాగర ప్రవేశం చేయడానికి ఆయత్తమవుతున్న ప్రదేశం అది!నదంతా ఎర్రదనం పులుముకుంది.జాలరి విసిరిన వలలా చీకటి మరోవైపు నుండి నదిమీద పాకుతున్నది.నదికి ఎదురుగా ఉన్న గుడిమెట్ల మీద కూర్చున్నాడు హర్ష.అతని చూపు ప్రవహిస్తున్న గోదావరి మీదనే ఉంది.ఇందాకనే తాను నిమజ్జనంచేసిన తనతల్లి తాలూకూ చితాభస్మం, అస్థికలు ఆ నదితో పాటే దూరంగా సాగిపోవడం అతను భరించలేక పోతున్నాడు.‘అమ్మ వెళ్ళి పోతోంది! ఇక ఏ రూపంలోనూ కనబడదు’ అనే విషయం అతన్ని కుదిపేస్తోంది.అప్పుడొచ్చిందతనికి చెప్పలేని దుఃఖం!అమ్మ తనని అపురూపంగా పెంచింది.తల్లులందరూ తమ పిల్లల్ని అపురూపంగానే పెంచుతారు.

ఎన్నోత్యాగాలు చేస్తారు. కానీ అమ్మ తనని ఒక స్నేహితుడిలా చూసేది. అమ్మకి తాను చేసిన తప్పుల్ని కూడా చెప్పగల ధైర్యాన్నిచ్చింది. ఎప్పుడూ కోపం ప్రదర్శించేది కాదు.అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతోంది అనంత సాగరంలోకి! అమ్మ లేదంటే.. వెలుగులేనట్లే!హర్ష కళ్ళు అవిరామంగా వర్షిస్తూనే ఉన్నాయి.‘‘చీకటయిపోయింది. పడుకోండి’’ తనలాగే తండ్రి అస్థికలు నిమజ్జనం చెయ్యడానికొచ్చిన వ్యక్తి శ్రీహర్షని పలుకరించాడు.శ్రీహర్ష లేచి గుడిలో ఓ పక్కగా దుప్పటి పరుచుకున్నాడు.అప్పుడు గుర్తొచ్చిందతనికి, తాను వస్తుండగా సుశీల ఇచ్చిన ఉత్తరం సంగతి.‘‘ఏంటిది?’’ అడిగేడు హర్ష భార్యని.‘‘అత్తయ్య. మీకు రాసిన ఉత్తరం’’హర్షకి అర్థం కాలేదు. ‘‘ఉత్తరమా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.‘‘అవును. అత్తయ్య తాను చనిపోయాక మీ కిమ్మని చెప్పేరు’’హర్ష సంశయంగా చూశాడు.సుశీల నవ్వింది. ‘‘ఏం లేదు ఏవిటో అత్తయ్య పిచ్చి. నా చేతనే రాయించింది. ఆ రోజు అసలు బాగోలేదావిడకి’’ అంది.