గుమ్మానికి మామిడితోరణాలు, పూలదండలు కడుతున్నాడు చక్రధర్‌.‘‘నేను కడతాను ఉండండి బాబాయిగారూ!’’ అన్నాడు ప్రశాంత్‌.‘‘ఫర్వాలేదు నాన్నా! నీ పుట్టినరోజు ఏర్పాట్లు నువ్వే చేసుకోవడం ఏం బాగుంటుంది?’’ అన్నాడు చక్రధర్‌. ప్రశాంత్‌ ఆయన చేతిలోని పూలదండ అందుకుని గుమ్మానికి కట్టాడు. అతను అప్పుడే తలస్నానం చేసి వచ్చాడు. జుట్టు పొడిపొడిగా పట్టులా ఉండి గాలికి కదులుతోంది. ఆరోజు ప్రశాంత్‌ ఇరవయ్యో పుట్టినరోజు. ఈ సంవత్సరమే బి.టెక్‌ పూర్తి చేశాడు.

వచ్చిన అతిథులు కూర్చోడానికి గది నాలుగువైపులా గోడ వెంబడి కుర్చీలు వేసింది సత్యవాణి. మధ్యలో ప్రశాంత్‌ కూర్చోవటానికి మరో కుర్చీ వేసింది. అప్పటికే ఇరుగుపొరుగువారు నలుగురైదుగురు వచ్చారు. చూస్తూండగానే అతిథులు అందరూ వచ్చేశారు. ప్రశాంత్‌ కొత్తబట్టలు కట్టుకుని మధ్యలో వేసినకుర్చీలో కూర్చున్నాడు. సత్యవాణి ప్లేట్లో అక్షతలు కలిపి ఎదురుగా టీపాయ్‌ మీద పెట్టింది.ఆహ్వానితులుగా వచ్చిన దంపతులు ప్రశాంత్‌కి చెరొక పక్కగా నిలబడి తలమీద అక్షతలు చల్లారు. చక్రధర్‌ ఫొటోలు తీశాడు. జవసత్వాలతో కళకళలాడుతున్న ప్రశాంత్‌ని కళ్ళారా చూసుకుంటూ ‘‘ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు సుఖంగా జీవించు’’ అని ఆశీర్వదించాడు చక్రధర్‌.

సత్యవాణి పలకల గిన్నెతో పాయసం తీసుకువచ్చింది. చక్రధర్‌ స్పూన్‌తో కొంచెం పాయసం తీసి ప్రశాంత్‌ నోటికి అందించాడు. తర్వాత సత్యవాణి కూడా తినిపించింది. రెండువేల రూపాయల నోట్లు ఒక ఐదు, ప్రశాంత్‌ జేబులో పెడుతూ ‘‘నీకు ఇష్టమైన బట్టలు కొనుక్కో నాన్నా!’’ అన్నాడు.ముత్తైదువలు నలుగురూ ప్రశాంత్‌కి హారతి ఇచ్చారు. ‘‘నాకు ఇలా పాత పద్ధతిలో సంప్రదాయబద్ధంగా చేయటం ఇష్టమండి. ‘కేక్‌ కట్‌ చేసి ఇప్పటి రోజుల్లోలాగే ఫంక్షన్‌ చేయించమంటావా? పాత పద్ధతిలో నలుగురినీ పిలిచి అక్షతలు వేయించమంటావా?’ అని మా బాబుని అడిగాను. ‘మీ ఇష్టమే నా ఇష్టం బాబాయ్‌!’ అన్నాడు’’ అని ప్రక్కన కూర్చున్న అతనితో అన్నాడు చక్రధర్‌.