‘‘నాలిక మీద మచ్చలున్నాయి కాబట్టి నేనెవర్ని తిట్టినా తగుల్తుందన్నది మా రంగనాథపురంలో ప్రతీతి. అక్కడి చెట్టియార్లకి అప్పు ఎగ్గొట్టిన వారింటికి తెల్లవారే తీసుకుపోయి నాతో నోటికొచ్చినట్లల్లా తిట్టించేవారు. ఫలంగా నాకు బేడా ముట్టేది. అలా మొదలైంది నా జీవితం. ఎన్నో రాత్రులు పస్తులున్నాను.కానీ ఏనాడూ మీలా చావాలనుకోలేదు.బేడా అంటే తెలుసునా..పన్నెండు పైసలు.’’

డబ్బున్న వాడు ఏం చెప్పినా బాగానే ఉంటుంది. ముఖ్యంగా వాడి ఇప్పటి ఈ ఖ్యాతికి కారణమైన డబ్బు లేనప్పటి కథలు కమ్మగా వారుస్తాడు. తిరువణేశ్వరన్‌ అతడి పేరు. డెబ్భై ఎనిమిదేళ్ళ మునుపు నుంచి సూర్యుని కాంతిని ఎరిగినవాడు. ఎంత కోటీశ్వరుడంటే రేపు అతను చనిపోతే తన శవాన్ని ‘‘పార్థివ దేహం’’ అని పిలిపించుకోగలిగినంత.‘‘కోట్లు సంపాయించాను. పిల్లల్లేరు. పెళ్ళాలూ లేరు. హాఁ హాఁ..’’నవ్వురాకపోయినా, బాగోదేమోనని పెదవులు విప్పార్చారు వాళ్ళిద్దరూ.‘‘ఏం పేర్లు మీ పేర్లు?’’వాళ్ళు చెప్పలేదు.‘‘నేనేమీ పోలీస్‌ కంప్లెయింట్‌ ఇవ్వన్లే... అయినా చావడానికి మీకు నా బిల్డింగే దొరికిందా?’’‘‘కోటిన్నరకి పైగా అప్పు ఉంది. చావక ఏం చెయ్యాలి?’’‘‘ఆ కోటిన్నర నేనిస్తాను పేర్లు చెప్తారా?’’‘‘హయగ్రీవ్‌’’ అన్నాడతను తడుముకోకుండా. ఆమెకు నోరు పెగల్లేదు.‘‘షీ ఈజ్‌ మరియా’’‘‘ఓహ్‌... లవ్‌ మేరేజ్‌.

అయినా పేరు చెప్తే ఎవడయ్యా కోట్లిచ్చేది. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు బిల్డింగ్‌ మీదనుంచి దూకక్కర్లే, నేనే తోయించేస్తాను ఈ సారి కనబడితే. హాఁ హాఁ హాఁ ..’’తిరువణేశ్వరన్‌ పక్కన ఐ-పేడ్‌ పట్టుకుని నిలబడ్డ పిల్ల అరవంలో నవ్వింది. అతని ఎ.సి. ఛాంబర్‌లో వీళ్ళతో పాటూ ఉన్న ‘సుందరేశ్వరన్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ స్టాఫ్‌ ముగ్గురూ నవ్వితే తనూ నవ్వుదామని వాళ్ళ ముఖాలు చూసింది మరియా.‘‘అన్‌ ఫినిష్డ్‌ బిల్డింగ్‌, ఆదివారం కనుక ఎవరూ ఉండరూ... పద్నాలుగు అంతస్థులూ ప్రయాసపడి ఎక్కి దూకితే చులాగ్గా చచ్చిపోవచ్చునన్న చచ్చు అయిడియా ఎవరిదీ?’’‘‘ఎవరిదో ఒకరిది లెండి. మా దారిన మమ్మల్ని పోనివ్వండి.’’‘‘దూకబోతున్న మిమ్మల్ని కాపాడాను. ఆ మాత్రం సమాధానానికి నోచుకోనా? మీ దారిన మిమ్మల్ని పోనిస్తే ఏం చేస్తారు? ఏ దారిన పోతారు? రౌరవ రహదారుల్లోనా? హాఁ హాఁ హాఁ ..’’