దశరథుడికి నలగురు కొడుకులు. నాకూ నలుగురు కొడుకులే! అంటే నాకు అదనంగా మరో ఎనిమిది చేతులు కలిశాయన్నమాట. అబ్బో! కాయకష్టంతో పొలంపనులు చేసుకుంటే బంగారు పంటలు పండించవచ్చు అని తెగ మురిసిపోయాడు ఆ కన్నతండ్రి. కొడుకులతో కలిసి పంటచేలల్లో ఒళ్ళు వంచి కష్టపడ్డాడు. మరి ఆ తండ్రి కన్న కలలు ఫలించాయా? లేక ఆ కుటుంబం తలోదారీపట్టి తీరంలేని గమ్యాలకు కొట్టుకుపోయిందా?

*************************

ధూపదీపాల పరిమళం, రేకలు విప్పుతున్న మల్లెమొగ్గల సుగంధం కొలనుపైనుంచి తేలివచ్చిన చిరుగాలితో కలిసి శివాలయం ఆవరణంతా పరివ్యాప్తం చెందింది. శివస్తుతి, మంత్రోచ్ఛారణల లయబద్ధమైన శబ్దంస్థానంలో నిశ్శబ్దం ఆవరించింది. గుడిగుమ్మంపైన ప్రమిద వెలుగు మందగిస్తోంది. మోచేయి తలక్రిందపెట్టుకుని పక్కకుఒత్తిగిలి పడుకున్న రాజేశ్వరి పయటచెంగు నోటికి అడ్డుపెట్టుకుని రోదిస్తోంది. మెల్లగా మొదలైన ఆమె ఏడుపు సన్నటిశబ్దంతో వెక్కిళ్ళుగామారి డొక్కలు పైకిలేస్తున్నాయి. తల్లి నడుముమీద చెయ్యేసి నిద్రిస్తున్న గౌరికి మెలకువ వచ్చింది. తమకు కాస్త అవతల నిద్రపోతున్నవారు నిద్రలేచారేమోనని కంగారుగా వాళ్ళవంక చూసింది గౌరి. వారు గాఢనిద్రలో ఉండడం గమనించి స్థిమితపడింది. అమ్మకు ఇంకా దగ్గరగా జరిగి, తనవైపు తిప్పుకుని, ఆమె కన్నీరు తుడుస్తూ ‘‘ఏడవకమ్మా! గుండెనిబ్బరం చేసుకో, పడుకో’’ అంది అనునయంగా. వీపుమీద మృదువుగా రాస్తూ ఓదారుస్తున్న కూతురుస్పర్శతో తననుతాను సంబాళించుకుంది రాజేశ్వరి. సలుపుతున్న దుఃఖాన్నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ మెల్లగా నిద్రలోకి ఒరిగింది. గౌరి మనసులో ముసురుకున్న ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి.

*******

పదిహేనేళ్ళ వయసులో రఘురామయ్యను పెళ్ళిచేసుకుని కాపురానికి వచ్చిన రాజేశ్వరి అత్త మామలు, మరుదులు, ఆడబడుచులపట్ల చూపే ఆదరాభిమానాలు ఆమెను అత్తింటివారికి అభిమానపాత్రురాలిని చేశాయి. ఇరుగుపొరుగుల మంచిచెడ్డల్లో, కష్టసుఖాల్లో మనఃస్ఫూర్తిగా పాలుపంచుకునే రాజేశ్వరి, రఘురామయ్య వారికి ఎంతో ఆత్మీయులయ్యారు. రాజేశ్వరి భర్తతోపాటు తను కూడా వెళ్ళి పొలంపని చేసేది. ఇంటికొచ్చాక గొడ్లపని, వంట, ఇంటిపని, అన్నిటినీ అవలీలగా, అలుపు తెలియనట్టుగా చేసే రాజేశ్వరి మంచి పనిమంతురాలుగా పేరు తెచ్చుకుంది.మొదటి రెండుపురుళ్లకు మాత్రమే పుట్టింటికి వెళ్ళింది రాజేశ్వరి. తరువాత మూడు పురుళ్ళూ ఊళ్లోనే మంత్రసాని పోసింది. నలుగురు మగపిల్లల తరువాత పుట్టింది గౌరి. దశరథ మహారాజుకులాగా తమకు నలుగురుకొడుకులని రాజేశ్వరి, రఘరామయ్య మురిసిపోయేవారు. నలుగురు కొడుకులంటే ఎనిమిది చేతులు, నాలుగు రెట్లు ఆర్జన అన్న ఆలోచన వారిని ఉత్తేజపరచేది. కొడుకులు వ్యవసాయంలో కుదురుకుని తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. అందుకే పెద్దగావాళ్ళ చదువుసంధ్యలమీద శ్రద్ధ పెట్టలేదు.