అమెరికాలో కూతురు ఇంటికి వెళ్ళాడతను. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళాడు. ఒక అపరిచితుడు వచ్చి మీరు ఇండియా నుంచి వచ్చారా ? అని ప్రశ్నించాడు. ఔను, హైదరాబాదు చెప్పాడు అతను. మాటలు కలిపి తన గోడు విన్నవించుకున్నాడా అపరిచితుడు. వద్దన్నా అతని వెంటపడి ఇంటికెళ్ళాడు. చుట్టమై వచ్చి దయ్యమై పీడిస్తున్నాడని వాపోయాడతను. ఇంతకీ ఆ అపరిచితుడెవరు ? అతని కథేంటి?

చలికాలం ఇక్కడ ఉండటం చాలా కష్టం. మరీ వారం రోజుల నుంచీ రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా చలి వణికించేస్తోంది..ఎంతటి వాడినైనా సరే.ఈ మధ్య పత్తాలేకుండా పోయిన సూర్యుడు ఆ రోజు మిట్టమధ్యాహ్నం వేళకి కిటికీల్లో నుంచి తొంగి చూస్తున్నాడు. శ్రీహరికి ప్రాణం లేచొచ్చినట్లయింది. కాసేపు అలా బయట తిరిగొద్దామని బయల్దేరుతుంటే, గదిలో వర్క్‌ ఫ్రం హోం చేస్తూ ఆఫీసు పనిలో ఉన్న శాలిని చప్పున బయటకు వచ్చింది.‘‘ఎక్కడికి నాన్నా?’’ అని అడిగింది.

‘‘వారం రోజులనుంచీ హౌస్‌ అరెస్టులా ఉంది. ఎల్లుండి ప్రయాణం గదా... పద్ధానుగు గంటలు కాలు మెదపటానికి ఉండదు. ఇవాళ కొంచెం ఎండ వచ్చింది. కాసేపు అలా తిరిగొస్తాను’’ అన్నాడు శ్రీహరి.‘‘కోటు వేసుకుని వెళ్ళు. సీజన్‌ బాగాలేదు. జలుబులూ, జ్వరాలూ..’’ అన్నది శాలిని.ఇంతలో సుధారాణి టీ.వీలో తెలుగు ఛానల్‌ ఆన్‌ చేసింది. నాలుగునెలల నుంచీ తెలుగులో న్యూస్‌ తప్ప సీరియల్స్‌ చూడలేక పోతున్నందుకు ఆమె బాధపడి పోతోంది.

ఆ సీరియల్స్‌లో ఒకరినొకరు చంపుకోవాలని ఎత్తుల మీద ఎత్తులు వేస్తుంటారు. చచ్చినా ఎవరూ చావని కారెక్టర్స్‌తో, నడిచీ నడవక నడిచే సీరియల్స్‌, టైం గడిచీ గడవక, చూసే వాళ్ళకు యమ థ్రిల్లింగ్‌గా ఉంటాయి మరి.టీవీ వార్తలో హైదరాబాదులో రోడ్డు యాక్సిడెంట్‌ చేసిన కుర్రాడినీ, కారులో అతని పక్కన ఉన్న అమ్మాయినీ, కారునీ మార్చిమార్చి చూపిస్తున్నారు.‘‘ఏమండీ వాడు మన రవిలా ఉన్నాడు చూడండి..’’అన్నది సుధారాణి. గొంతులో ఆశ్చర్యం ఆదుర్దా కలగలిపి.‘‘వాడే...’’ అని ధృవీకరించింది శాలిని.‘‘ఇదివరకు కూడా ఎవరో ముసల్దాన్ని గుద్దాడు..’’ అన్నది సుధారాణి.