ఆ రోజు ఉదయం మా బాల్కనీలో అబ్బురపరచే ఒక దృశ్యం చూశాను. లేత బూడిదరంగులో బుజ్జిబుజ్జిగా ఉన్న ఒక పిచ్చుక పూలకుండీలోని గింజలను ముక్కుతో ముద్దాడుతోంది. నేను మా వంట గదిలోంచే ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ చాలాసేపు ఉండిపోయాను. దగ్గరకెళితే కలలాంటి ఆ యదార్థదృశ్యం ఆవిరై పోవచ్చు. అంతలో ‘‘ఏంటండి ఇక్కడ అలా నిలుచుండిపోయారు?’’ అన్న మా ఆవిడ పలకరింతకు ఉలికిపడ్డాను.

పిచ్చుక ఎగిరిపోయింది. ఎందుకోగానీ, అప్పుడే ఆంజనేయకుమార్‌ గుర్తుకు వచ్చాడు. అతను నాకు బి.ఇ.లో సహాధ్యాయి, సన్నిహితుడూను. అవి నేను మద్రాసులోని (ఇప్పటి చెన్నై) గిండీ సాంకేతిక కళాశాలలో చేరిన కొత్తరోజులు. వసతి గృహంలోచేరేదాకా కొద్దిరోజులు నేను సూళ్ళురుపేటనుండి మద్రాసుకు రైల్లో రోజూ ప్రయాణం చేశాను. మొదటిరోజే కుమార్‌ విరామసమయంలో పలకరించాడు. ఆ సంవత్సరం చేరిన విద్యార్థుల్లో, తెలుగువాళ్ళం మొత్తం ఐదు మందిమి మాత్రమే ఉండేవాళ్ళం. కుమార్‌ హైదరాబాద్‌ నుండి వచ్చాడు.

మిగిలిన వాళ్ళలో ఒకరు చీరాల, మరొకరు గుంటూరు, నాగేంద్రదేమో విజయనగరం. మా సీనియర్లు (చివరి సంవత్సరం విద్యార్థులు) అప్పటికింకా కళాశాలలోనే ఉండడంవల్ల, మాకు వసతి గృహంలో గదులు కేటాయించబడలేదు. కొన్నిరోజులు వేచి ఉండవలసిన పరిస్థితి. ఐతే ఆ సమయంలో నేను స్వంతంగా ప్రయాణంచేసి, తరగతులకు హాజరై మరలా సాయంత్రం రైలు పట్టుకుని ఇంటికి చేరుకోవడం గమ్మత్తుగా అనిపించేది.

కుమార్‌ టి.నగర్లోఉన్న వాళ్ళ పిన్నిదగ్గర, నాగేంద్ర పల్లావరంలో ఉన్న వాళ్ళ మామయ్య ఇంట్లో బస చేశారు. తొందరలోనే కుమార్‌కు నాకు ఏరా అని పిలుచుకునే సాన్నిహిత్యం ఏర్పడింది. ఓరోజు మా సహాధ్యాయులు ఇద్దరు ముగ్గురం మాట్లాడుకుంటున్నాం. సంభాషణ ఆంగ్లంలో జరుగుతోంది. నేను ఎవరి గురించో మాట్లాడుతూ ‘‘హి డూ నాట్‌ నో టమిళ్‌’’ అన్నాను. వెంటనే కుమార్‌ ‘‘డునాట్‌ నో కాదు, డజ్‌ నాట్‌ నో అనాలి’’ అని సరిదిద్దాడు. అది నేను ఆ మహానగరంలో, ఆంగ్లంలో నేర్చుకున్న తొలిపాఠం. నేను ఇంటర్మీడియేట్‌ వరకు తెలుగు మాధ్యమంలోనే చదివాను. మొదటినుంచి, ఆంగ్లభాష మీద ఉన్న మమకారంవల్ల తప్పులో, తడకలో ఆ భాషలో ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించేవాణ్ణి. అలా కుమార్‌ సవరించిన తప్పు నా జీవితంలో మరెప్పుడూ చేయలేదు. అతని సలహాలతో అతి తొందరలోనే నేను చక్కటి భాషా పరిజ్ఞానం పొందాను.