ఆ మిత్రద్వయం పరాయి రాష్ర్టానికి విహారయాత్రకెళ్ళింది. వాళ్ళ ఆఫీసుకి మెటీరియల్‌ సరఫరాచేసే కంపెనీ ఆహ్వానంమేరకే వాళ్ళీ యాత్రచేశారు. ఇక రైలెక్కిన దగ్గరనుంచీ మొదలయ్యాయి వాళ్ళకి అడుగడుగునా తిప్పలు! దిగాల్సిన చోట రైలు దిగలేకపోయారు. డబ్బు ఆదా కోసం ఆటో మానేసి బస్సు ఎక్కి రాంగ్‌ అడ్రస్‌లో దిగారు. మళ్ళీ ఆటోఎక్కి భారీగా సమర్పించుకున్నారు. స్టార్‌ హోటల్‌ రూములో దిగితే ఎ.సి ఆన్‌ చేసుకోవడం కూడా చేతకాలేదు వాళ్ళకి. రైల్లో కూల్‌డ్రింక్‌ తాగితే చుట్టూ ఉన్నవాళ్ళు ఆ మిత్రద్వయాన్ని ‘స్పిరిట్‌’ట్యువల్‌ సొసైటీ బ్యాచ్‌కింద లెక్కేశారు!

ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా ముందుకు దూసుకుపోతోంది. మూర్తి, రావు ఇద్దరూ రాబోయే స్టేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆకలి దంచేస్తోంది. రైలు ఆగింది. రావు లేచి ఎవరితోనో మాట్లాడాడు. బూమరాంగ్‌లా వెనక్కువచ్చి తన సూటుకేసు పట్టుకుని, మూర్తీ దిగుదిగు ఇదే మనం దిగాల్సిన స్టేషనట. రావు మాటల్లో తొందరచూసి మూర్తి చిద్విలాసంగా చిరునవ్వు చిందించి, ఎంతమాత్రం కాదు అన్నాడు. రావు ఆశ్చర్యంగా చూశాడు. అవును. ఇది టౌనుస్టేషన్‌. తర్వాత జంక్షన్‌ స్టేషన్‌ వస్తుంది, మనం అక్కడే దిగాలి అన్నాడు తాపీగా.ఆర్యూ ష్యూర్‌...హండ్రెండ్‌ పర్సెంట్‌. నాకు బాగా తెలుసు అన్నాడు మూర్తి సర్వాంతర్యామిలా.సరే నేను గేటు దగ్గర నిలుచుంటాను. నీవు కూడా రెడీగా ఉండు అని కదిలి ముందుకెళ్ళాడామిత్రుడు.అంతలో సెల్‌ఫోన్‌ మోగింది. చాలాసేపు అలాగే రింగైంది. ఫోను రింగవుతుంటే ఎత్తరేం? అసహనంగా అరిచాడు మూర్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని ఉద్దేశించి.

అది నాదికాదు నీదే, తాపీగా చెప్పాడతను.అవును కదూ, ఇది నా బుజ్జిముండ పలకరింపే కదూ అని.సెల్లు తీసి మాట్లాడాడు. అటు నుండి జాన్‌ విష్‌ చేశాడు.ఎక్కడ ఉన్నారు సార్‌ మీరిద్దరూ. ఓహో జాన్‌ భయ్యా, మేం టౌనుస్టేషన్‌ దాటాం, జంక్షన్‌ స్టేషన్‌కి చేరుకుంటున్నాం చెప్పాడు మూర్తి.సరే అంతా సక్రమగా సాగుతోంది కదా. ఉయ్‌ విల్‌ మీట్‌ సూన్‌. హడావిడిగా కాల్‌ కట్‌ చేశాడు జాన్‌.ఇక్కడే దిగాల్సింది మీరిద్దరూ... ఈ రైలు జంక్షన్‌ స్టేషనుకు వెళ్ళదు, కాట్లకుక్క కరిచినట్లు ఉరిమాడు ఎదురుగా ఉన్న భైరవ్‌నాథ్‌.