దేవుడు ప్రతిమనిషికీ కావాలనే ఏదోఒకలోటు ఉంచుతాడేమో! ధనవంతుడికి కూడా చాలా లోటుపాట్లు ఉంటాయి. అతడిదగ్గర ధనం ఉండవచ్చు. కానీ ఈ సమాజంలో చాలామందికి ఉండేది అతనికి లేకపోవచ్చు. అందుకే లోటుపాట్లతో ఉండేవారికి ఓ ధనవంతుడు ఆసరాగా ఉండేవాడు. అలా ఆసరా అందించడమే జీవితపరమార్ఘంగా అతడు భావించాడు. తన కొడుక్కికూడా అదే చెప్పాడు. ఆ కొడుకు దానిని పాటించాడా?

ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థులతో ఆ ఆఫీసంతా హడావిడిగా ఉంది. నాకు ఇంటర్వ్యూ ముఖ్యంకాదు. అనుభవం ముఖ్యం. ఐ.టి.కి సంబంధించిన ఇలాంటి ఆఫీసు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. పూర్వీకులు తరగనిఆస్తి ఇస్తే మానాన్నా దాన్ని తరగని ధనంగా మార్చాడు. పుట్టినప్పటినుంచీ ఒకేఒకసూత్రం ఆయననాకు చెబుతూనే ఉన్నాడు. ‘సంపద కుటుంబానికి సరిపడా సమకూర్చుకోవాలి. సంపద మరింతగా పెరిగినప్పుడు అవసరానికి కొందరికైనాపంచే మనస్తత్వం అలవరుచుకోవాలి. డబ్బుపాపిష్ఠిది. డబ్బులేనప్పుడు వితరణజ్ఞానం ఉంటుంది. డబ్బురాగానే దాచుకోవాలనే అజ్ఞానాన్నికూడా అదేప్రసాదిస్తుంది. అందుకే ధనాన్ని ఫలవంతంగా ఉపయోగించుకునే విచక్షణ మనకురావాలి’ అనే ఆయన మాటలు చిన్నతనంలో నాకు అర్థంకాలేదుగానీ ఇప్పుడిప్పుడే ఆ మాటల్లోని పరమార్థం అవగతమవుతున్నట్లనిపిస్తోంది. అందుకే మంచికంపెనీపెట్టి కొందరికైనా ఉద్యోగాలివ్వాలనుకుంటున్నాను.

నేను ఐ.టి పట్టభద్రుడినేగానీ, ఉద్యోగాలకుసరిపోయేవారిని ఏవిధంగా ఎంపికచేయాల్లో పూర్తిగాతెలియదు. ఇలాంటి ఇంటర్వ్యూలకు హాజరై అనుభవం సంపాదించాలనే ప్రయత్నంలోని భాగమే నాయీ ఇంటర్వ్యూ కార్యక్రమం.దాదాపు పదీపదిహేనుమంది అభ్యర్థలు తమవంతు ఎప్పుడొస్తుందాఅని ఎదురుచూస్తున్నారు. అందులో ఒక అమ్మాయి నన్ను అమితంగా ఆకర్షించింది. పూర్తిగా భయపడటంలేదుగానీ ఆమె వదనంలో చిన్నపాటివెరుపు స్పష్టంగా కనబడుతోంది. నేను ఆ హాలులోకి ప్రవేశించేసరికే అక్కడున్న కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి ఒకటితప్ప! ఆ ఒక్కటీ ఆమెపక్కనే ఉండటం నాకు కలిసివచ్చింది. అందుకే ఆమెపక్కనే కూర్చొని చిన్నగా నవ్వాను. ఆమెకూడా కనీకనపడకుండా సన్నపాటి మందహాసం ప్రదర్శించింది.

‘ఇంటర్వ్యూకేనా?’ మాటకలిపే ఉద్దేశ్యంతో అడిగాను. ‘ఇక్కడ మరేదైనా కార్యక్రమం ఉందా?’ షార్పుగా జవాబిచ్చింది నన్ను సూటిగాచూస్తూ. ‘ఇలాంటి వేషాలు నాదగ్గర కుదరవ్‌మిస్టర్‌’ అన్న సందేశం కూడా ఆమె మాటల్లో ఉన్నట్లు నాకు తోచింది.‘‘ఈమధ్య కొత్తరకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అభ్యర్థులకుతెలియకుండా కొందరు సైకాలజిస్టులు వాళ్ళమధ్యే కూర్చొని అభ్యర్థులను మాటల్లోపెట్టి వాళ్ళల్లో ఎంతసరుకుందో తెలుసుకునే టెక్నిక్‌ ఉపయోగిస్తున్నారని ఎవరో చెప్పగావిన్నాను’’ అని చెప్పాల్సి వచ్చింది. ఆమె నన్ను మరోవిధంగా భావించకుండా ఉండేందుకే అలా చెప్పాను. దాంతో ఆమె ఆలోచనలో పడింది. కానీ ఆమెకు అటువైపు కూర్చున్న మరో అభ్యర్థిమాత్రం నన్ను సీరియస్‌గాచూసి, ‘‘కొంపతీసి మీరు అలాంటి ‍సైకాలజిస్టు కాదుకదా?’ అని బయటికే అనేశాడు.