‘మనిషి అంటే జంతువుల్ని వేటాడేవాడేగానీ, తనలోని జంతువును మాత్రం వేటాడనివాడు!’అంటారు వేదాంతులు.ఈ విషయం నాకు పూర్తిగా వర్తిస్తుంది. అక్షరాలా! నేను మనిషిని.నా పేరు అదే.

మా నాన్న నాకు పెట్టినపేరు కొంచెం ఆధునికంగా ‘యనీష్‌’. నాకు వేట అంటే చిన్నప్పటినుంచీ ఇష్టమే. ఊహ తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యంగా చూసింది మా ఇంట్లోని డ్రాయింగ్‌రూమ్‌లో గోడమీద వేలాడే తుపాకినే! నాన్న మేడమెట్లు దిగి జీపు స్టార్ట్‌ చేసేసరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి జీపులో కూర్చునేవాడిని. నాన్న జీపులో వెళుతూ పిట్టల్నీ, అడవి కుందేళ్ళనూ వేటాడేవాడు. అలా నాన్నను చూసే నేనూ వేటాడ్డం నేర్చుకున్నాను.ఎలిమెంటరీ స్కూలు వరకూ నేను మా ఊరికి దగ్గరలోని టౌన్‌స్కూల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత నన్ను విశాఖపట్నంలోని ఒక రెసిడెన్షియల్‌ స్కూల్లో చేరుస్తానన్నారు. నేను డెహ్రాడూన్‌ సైనికస్కూల్లో చేరతానని గొడవచేశాను.

‘‘అంతదూరం వద్దునాన్నా, విశాఖపట్నం అయితే వారానికోసారి వచ్చి చూడొచ్చు నిన్ను’’ అంది అమ్మ అనునయంగా. నేను బాగా ఏడ్చాను. ఐనా మా అమ్మ ఒప్పుకోలేదు. ఇక నాన్న అమ్మను ఒప్పించి నన్ను సైనికస్కూలుకు పంపారు. నా జీవితలక్ష్యం సైనికాధికారి. అందుకు కారణం మా ఇంట్లో ఉండే తుపాకి!నా జీవితలక్ష్యం కోసమే కృషిచేశాను. ఆర్మీలో డైరెక్ట్‌ రిక్రూట్‌ అధికారిగా సెలక్టయ్యాను. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణకోసం పంపించారు నన్ను. నా కల నెరవేరింది. నా ట్రైనింగ్‌ అద్భుతంగా తోస్తోంది. ఉదయం ఐదుగంటలకే క్రాస్‌కంట్రీ. గుర్రాలమీద కొండలు, గుట్టలు ఎక్కుతూ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత రైఫిల్‌ షూటింగ్‌. ఇంకా శత్రుసైన్యంతో ఎలా తలపడాలి? ఫేక్‌ వార్‌ డ్రిల్స్‌, మాక్‌ డ్రిల్స్‌.. ఇలా ఎన్నెన్నో విన్యాసాలు.