భారీ లైట్ల వెలుగులతో కళకళలాడుతోంది రాగిణి-ప్రకాష్‌ ల పెళ్ళి మండపం. మగపెళ్ళివారు విడిదిలో సెటిల్‌ అవగానే, మేళ తాళాల మధ్య అట్టహాసంగా పానకం బిందెలతో వచ్చిన ఆడపెళ్ళివారు మగపెళ్ళివారికి పానకం గ్లాసులు అందిస్తున్నారు.నాజూగ్గావున్న ఓ గాజులచెయ్యి వెండిగ్లాసుతో పానకం ఇస్తూ ఉంటే, ఆ గ్లాసు అందుకుని ఓ గుక్క తాగి తలెత్తి చిరునవ్వుతో ఆ అమ్మాయికి థాంక్స్‌ చెప్పబోయిన పెళ్ళికొడుకు ప్రకాష్‌ - ఒక్కసారిగా అదిరిపడ్డాడు. 

ఎదురుగా నవ్వుతూ దర్శనమిస్తున్న ప్రశాంతిని చూడగానే అతనికి వెన్నులో విద్యుత్తు పాకినట్టైంది. బ్రెయిన్‌ బ్లాంక్‌ అయింది. పానకం గ్లాసు చేతిలోంచి జారిపోయింది.బ్యాండు మేళం ధ్వని మంగళ వాయిద్యంలా కాకుండా సమ్మెట దెబ్బలా గుండెలమీద తగిలి అతనిని కల్లోల పరుస్తోంది. చీకట్లను తరిమి కొడుతున్న లైట్ల వెలుగు, నల్లబడిన అతని మొహంలో ఇంకిపోయిన పెళ్ళికళని తిరిగి తేలేకపోతోంది. అయోమయంగా దిక్కులు చూశాడు. ‘ఇది ఇదెలా సాధ్యం?’ లోలోనే గొణుక్కున్నాడు.అతని అవస్థ అర్థం అవుతున్నా, గమనించనట్టే మొహంపెట్టింది ప్రశాంతి.

ప్రకాష్‌ వదిలేసిన గ్లాసు నేలను తాకకుండా ఆపి అదే చిరునవ్వుతో ‘‘తీసుకోండి స్సా...ర్‌’’ అంటూ గ్లాసు మళ్ళీ అతని చేతికి అందించింది ప్రశాంతి. యాంత్రికంగా అందుకుని అప్రయత్నంగా ఒక్కగుక్కలో మొత్తం తాగేసిన ప్రకాష్‌, తలతిప్పి తల్లికేసి ప్రశ్నార్థకంగా చూశాడు.‘మగపిల్లాడివి పెళ్ళికొడుకువి నీకేం తక్కువ? ఛాతీ విరుచుకుని తలెత్తుకుని దర్జాగా ధైర్యంగా ఉండు’ అని కళ్ళతోనే కొడుక్కి ధైర్యం నూరిపోసిందావిడ.ప్రకాష్‌ యాంత్రికంగానే తిరిగి అందివ్వబోయిన ఖాళీగ్లాసు అందుకోకుండా నవ్వుతూ ‘‘థాంక్యూ ప్రకాష్‌గారూ’’ అని హుందాగా నడుస్తూ వెళ్ళిపోయింది ప్రశాంతి.