‘చిన్ముద్ర’ పబ్లికేషన్‌ హౌజ్‌లో మొదటిసారి లక్ష్మణ్‌ని చూసినప్పుడే అతనిలోని ప్రత్యేకమైన స్కిల్‌ని గమనించాడు ఫల్గుణరావు. అంతేకాదు, ‘‘పుస్తకాలు సర్దడం అందరికీ చేతకాదు తెల్సా. నీకు ఎలా అబ్బిందోగానీ...’’అని పొగిడేవాడు.

వారానికి కనీసం రెండు సార్లయినా షాపుకి వచ్చి ఓ రెండు పుస్తకాలైనా కొనుక్కు వెళ్ళే పండిపోయిన పుస్తకాల పురుగులా ఫల్గుణరావు, లక్ష్మణ్‌కూ బాగానే తెలుసు.‘‘తన చేతుల్లో ఉన్న కిరీటం దేవుడి తలపైకి చేరబోతున్నప్పుడు, ఆఖరి నగిషీ అద్దాక సాగనంపే ముందర.. బంగారప్పనోడి చేతిలోని భయం, భక్తి, ఒడుపు, ఆదరం, పనివాడితనం... అద్దీ... అలా పట్టుకుంటావురా’’ అన్నాడు ఇంకోసారెప్పుడో అబిడ్స్‌ సండే మార్కెట్లో రోడ్‌ పక్కన కనబడ్డప్పుడు.‘‘నా దగ్గర పనిచేస్తావా? ఇప్పుడు చేసే పనే. పుస్తకాలు సర్దడం. నాకొక మినీ లైబ్రరీ ఉంది. అందులో పుస్తకాలు నువ్వు మెయింటెయిన్‌ చెయ్యాలి. ఇక్కడిచ్చేదానికంటే ఐదు వేలు ఎక్కువిస్తాను. ఫుడ్డు, షెల్టరు ఫ్రీ.ఏమంటావ్‌ ?’’‘‘అలాగే’’ అని తప్ప ఇంకేం అనలేకపోయాడు లక్ష్మణ్‌.‘‘ఇల్లు రీమోడలింగ్‌ పనులుచేయిస్తున్నాను. పాతది కొట్టేసి డూప్లే.ఆ పని అయ్యేవరకు అద్దింట్లో ఉంటున్నాను. దాదాపు అయిపోయింది. వారంలో షిఫ్టింగ్‌. ఇల్లు మారేప్పుడు పుస్తకాల ట్రాన్స్‌పోర్ట్‌ నువ్వే చూసుకోవాలి’’ అనేసి ఎడ్వాన్స్‌ ఇచ్చి వెళ్ళిపోయాడు ఫల్గుణరావు.

‘‘ఒక పుస్తకం మాయమవ్వడమంటే ఆషా మాషీ అనుకున్నావా ఏం? అది చదివినప్పుడు రేగిన ఎన్ని జ్ఞాపకాలు దాని అట్టలోపల నిక్షిప్తమయ్యి ఉంటాయో నీకేం తెలుసు..అణా కాణీ వెధవ్వి’’ ఫల్గుణరావు తనకిచ్చిన లిస్ట్‌లో ఉన్న అన్ని పుస్తకాలు కొత్తింటికి క్షేమంగా వచ్చాయి. ఒక్క పుస్తకం తప్ప.‘‘పుస్తకం నడిమధ్యలో నుసి రంగు సిరా ఒలికిపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశావా? అక్షరాలన్నీ నల్లబడిపోతాయి. ఓ రెండు పేజీలు రాయాలంటే ఏళ్ళ తరబడిగా ఎంతటి మేధ బుర్రలో పేర్చుకోకపోతే తప్ప రాయలేరని తెలుసా? అలాంటిది .. పుస్తకమే కనబడకపోతే!’’ నుదుటన చెమట్లు తుడుచుకుంటున్నాడు.తల ఊపాడు లక్ష్మణ్‌.‘‘సరిగ్గా విన్నావా? ‘రక్తం చిమ్మే ఎలక్ట్రిక్‌ బల్బు’ - అది టైటిలు. రచయిత పేరు కిరీటి. వెతికి తీసుకురా. నేను పైన నా బెడ్‌ రూంలో ఉంటాను’’ అంటూ మెట్ల వైపు కదిలాడు.