ఒకప్పుడు యువతకు మహాత్మాగాంధీ జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వామి వివేకానంద లాంటి ఎందరో రోల్‌ మోడల్స్‌. కానీ మరి ఇప్పుడు....! కాలం మారింది. డబ్బు సంపాదనే ఏకైకలక్ష్యంగా అంతులేని అక్రమాలకు పాల్పడిన నేరస్తుడే ఈ కథలో ఒక నవ యువకుడికి రోల్‌మోడల్‌! తప్పుదోవ పడుతున్న ఆ యువకుణ్ణి చూసి ఆవేదన చెందాడతను. ఆ నవయువకుడి జీవితాన్ని చక్కదిద్దేందుకు అతడుచేసిన ప్రయత్నం ఫలించిందా?

‘‘సిన్మాలు చూస్తావా?’’ తన ఎదురుగా ఉన్న కుర్చీలో అతి నిర్లక్ష్యంగా కూచున్న పదిహేనేళ్ళ మేనల్లుడు తేజావంక కించిత్‌ కోపంగా చూస్తూ అడిగాడు సూర్యం.‘‘ఓ...చూస్తాను. స్కూల్లోకన్నా థియెటర్లో ఉండటమే నాకెంతో ఇష్టం’’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ.‘‘వారానికి ఎన్ని సినిమాలు చూస్తావ్‌’’‘‘ఏడు రోజులూ ఏడు సినిమాలు. ఒక్కోసారి చూసిన సినిమాల్నే మళ్ళీమళ్ళీ చూస్తుంటాను. ఎందుకంటే, ఆ హీరోయిజాన్ని ఒంటబట్టించుకుంటేనే కదా స్కూల్లో ఆడపిల్లలందరి ముందూ నా కాలరెగిరేది’’ లేటెస్ట్‌గా చూసిన ఓ సినిమాలో హీరోలా చూయింగమ్‌ నములుతున్నట్టు ఫోజిస్తూ స్టయిల్‌గా ఒక్కోపదాన్ని ఒత్తిమరీ చెప్పాడు తేజ.‘చెల్లాయ్‌, నీ కొడుకు చెడిపోయాడే. వీడిని బాగుచేయడం నావల్ల కాదేమో? అనవసరంగా పిలిపించావ్‌ నన్ను’ మనసులోనే అనుకున్నాడు సూర్యం.

రెండ్రోజుల క్రితం మాధవి హైదరాబాద్‌ నుంచి విజయవాడలో తన పుట్టింటికి ఫోన్‌చేసి ‘‘ఒరేయ్‌ అన్నాయ్‌! నువ్వొకసారి అర్జంట్‌గా రావాలిరా’’ అంది ఇంచుమించు ఏడుపుగొంతుతో.‘‘ఏమైందే? బావ కానీ మళ్ళీ గృహహింస పెడుతున్నాడా?’’ ఆత్రుతగా ఆడిగాడు సూర్యం.‘‘బావని ఏమీ అనకు కళ్ళు పోతాయి. ఏదో పెళ్ళైన మొదటి రెండేళ్ళలో అత్తగారు బతికున్న రోజుల్లో ఇబ్బంది పెట్టినమాట నిజమేగానీ, నువ్విచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌తో అప్పుడే దార్లోకి వచ్చాడు. అయితే, ఈసారి దారితప్పుతున్నది నీ మేనల్లుడు తేజ. టెన్త్‌క్లాస్‌లోకి వచ్చాడేగానీ, బుద్ధీ జ్ఞానం లేదు. పొద్దస్తమానం సినిమాలు, షికార్లు, ఇంటికివచ్చి పోకిరీ డైలాగులు, రౌడీ ఫోజులు. వాణ్ణి అదుపులో పెట్టాలని నేనూ, మీ బావ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాణ్ణి అలా వదిలేస్తే మనకు కాకుండాపోయే ప్రమాదం ఉంది’’ కంప్లయింట్‌ చేసింది మాధవి.‘‘పిల్లల్ని పెంచడం ఓ ఆర్ట్‌. ఆ ఆర్ట్‌ మీ ఇద్దరికీ లేకపోయింది. ముద్దొస్తున్నాడని పెద్దయినా చంకన ఎక్కించుకున్నారు. ఇక వాడు ఆడింది ఆట, పాడింది పాటగా చలామణీ అవుతోంది. ఇంతకీ అక్కడికి నేను వచ్చి మాత్రం చేసేదేముంది?’’ అడిగాడు సూర్యం.