‘స్టార్ట్‌ ఇమ్మీడియట్లీ...’ రాజు ఇచ్చిన టెలిగ్రాం అందుకున్నాను.రాజు మా ఆయన స్నేహితుడు. ఈ ఆధునిక యుగంలో కూడా టెలిగ్రాం (ఈ కథ జరిగే సమయానికి టెలిగ్రాం పంపే విధానం ఉంది) ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. ఒక్క ఫోను కొడితే విషయం తెలిసేదే. బహుశా విషయం వెంటనే చెప్పడం ఇష్టంలేక అలా చేశాడేమో. నేను నెళ్ళాళ్ళనుండీ మా పుట్టింట్లో ఉంటున్నాను. మా పుట్టింటి సమస్యలు తీర్చవలసిన బాధ్యత నా మీద పడింది. ఇష్టం లేకపోయినా మావారు నన్ను పుట్టింటికి పంపారు. పిల్లలు ఎదిగి దూరంగా వెళ్లిపోయిన తరువాత ఆయన్ని ఒంటరిగా వదిలి రావలసిన అత్యవసరపరిస్థితి ఏర్పడింది మాపుట్టింట్లో.

సాధారణంగా నేను ఈమధ్య ఆయన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఆయన రిటైరైపోయారు. మేమిద్దరం కలిసి బతుకుతున్నాం. కొన్నాళ్లుగా నాలో నిర్లిప్తత! అనుకోని సంఘటన నన్ను కుదిపేసింది. ఇద్దరం ఒకే ఇంట్లో ఎవరికి వారుగా బతుకుతున్నాం. బహుశా పిల్లలు దూరమైపోయారనే దిగులు మా ఇద్దరినీ మౌనంగా మార్చేసిందేమో. డబ్బుకి ఇబ్బంది లేదు. సొంత ఇల్లుంది. కానీ మనశ్శాంతి లేదు. అంతే. ఆలోచనలు ఎటో పోతున్నాయి.

రాజు ఇచ్చిన టెలిగ్రాం నన్ను మళ్ళీ ఈ లోకంలోకి లాక్కొచ్చింది. ఆయనకేం జరగలేదు కదా...ఆయన ఆరోగ్యం మంచిదే. అన్నీ క్రమపద్ధతిలో జరుగుతాయి. వెంటనే రాజుకి ఫోన్‌ చేశాను. ఫోను పలకలేదు. ఇంటికి ఫోను చేశాను. అదీ అంతే. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లో చెప్పి వెంటనే బయల్దేరాను. విషయం ఏమిటో నాకే తెలియదు, ఇక ఇంట్లోవాళ్లకేం చెప్తాను. వెళ్ళాక కబురు చేస్తానని బయలుదేరాను.