ఆశలు ఆశయాలు నెరవేరకముందే చిన్నవయసులోనే పిల్లలు ఎగిరిపోయే ప్రయత్నం చేస్తే కష్టపడి పెంచిపెద్దచేసిన తల్లి బాధ్యతమరచిపోయి చూస్తూ కూర్చోవాలా? అలా ఎగిరిపోవడానికి స్వేచ్ఛఅనీ, హక్కు అనీ పేర్లుపెట్టుకుంటే ఆ తల్లి ఏం చేయాలి? సరైన ఎంపిక చేసుకోవడం చేతకానప్పుడు ఆ తల్లికి కనీసం తనపరిధిలో చెప్పే బాధ్యత కూడా ఉండదా? అలాంటి సమస్యకు ఈ కథలో తల్లి ఎలాంటి పరిష్కారం చెప్పిందో చదవండి.

సెల్‌ రింగవడంతో వసుధ ఆలోచన్లకు బ్రేక్‌ పడింది. హాల్లో ఎప్పట్నించి మోగుతోందో, బ్యాగ్‌లోంచి సెల్‌ తీసి చూసింది. పావని కాలింగ్‌. సెల్‌ ఆన్‌ చేసింది.‘‘హల్లో! చెప్పు నాన్నా!’’ అంది వసుధ.‘‘ఇందాకట్నుంచి రింగ్‌ చేస్తున్నానమ్మా! పడుకున్నావా?’’ అంది పావని.‘‘ఇప్పుడే ఆఫీస్‌ నుంచి వచ్చి స్నానం చేసి, టీ తాగి తలనొప్పిగా ఉంటే అలా నడుము వాల్చా. ఇంటికొచ్చేశావా?’’‘‘ఈ రోజు శనివారం కదా! సెలవు. ఇంటి దగ్గరే ఉన్నాను’’.‘‘ఏమిటి విశేషాలు? నీ ముద్దుల చెల్లెలు రమణి పెళ్ళి గురించి ఏమంటోంది?’’ అడిగింది వసుధ.‘‘కొత్తగా ఏమనలేదు. ‘పోనీ నీ క్లాస్‌మేట్‌ ప్రకాష్‌ను చేసుకోవే’ అన్నానమ్మా. ఏమంటుందో అని. ‘వాడు నాకు మన ‘చింటూ’తో సమానం. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు అందమ్మా’’ అంది ఒకటే నవ్వుతూ.

ప్రకాష్‌ అంటే రమణికి మెడిసిన్‌లో క్లాస్‌మేట్‌. వాళ్ళ కులం వేరు. బుద్ధిమంతుడు రమణి ఏం చెప్పినా చేస్తాడు. ఎక్కడ్కి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు. రమణికి ఎక్కడికివెళ్ళినా ఎస్కార్ట్‌లా ఉంటాడు. ఒకటి రెండు సార్లు వసుధ వాళ్ళింటికొచ్చి వారం పదిరోజులు ఇద్దరూ పిజికి ప్రిపేరయ్యారు.వసుధ కూడా తేలిగ్గా తీసుకుని నవ్వేసింది. అది తన కూతురు. అది అలాంటి పని ఎప్పుడూ చెయ్యదు. పైగా తనకు ప్రామిస్‌ చేసింది కూడా.‘‘పోనీ హరిని చేసుకోవే అన్నానమ్మా!’’ అంది పావని.వసుధ షాకయ్యింది. అతను కూడా వసుధ వాళ్ళ కులం కాదు.‘‘ఏమందీ?’’ అంది కంగారుగా.‘‘నాకు ఇంతవరకు ఐడియాలేదు. ఆలోచిస్తా. అయినా అమ్మ ఇష్టం అంది’’ పావని.‘‘హరి రమణి కంటే చిన్నవాడే’’.‘‘అలాగా!’’‘‘పైగా మెడిసిన్‌ కాదు. ఎక్కడో స్టేట్స్‌లో ఉంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు దీంతో చదువుకున్నాడు. నల్లగా ఉంటాడు. మన కులం కాదు’’ అంది వసుధ.