‘‘వద్దూ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వద్దూ’’ అంటూ కేక పెట్టిన శశాంక్‌ని చూసి నివ్వెరపోయాడు గౌతమ్‌. అతనెందుకలా అరిచాడో అర్థంకాలేదతనికి. శశాంక్‌మొహంలో భయంచూసిన గౌతమ్‌కి మతిపోయింది’’. 

వాళ్ళిద్దరూ మంచిస్నేహితులు. హైదరాబాద్‌లో ఉన్న గౌతమ్‌ని కలవడానికి వైజాగ్‌ నుంచి వచ్చాడు శశాంక్‌. ఉద్యోగరీత్యా గౌతమ్‌ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన శశాంక్‌ కొద్దిరోజుల్లో ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా వెళుతున్నాడు. ఆ పనులమీదే అతను హైదరాబాద్‌ వచ్చాడు. రెండ్రోజుల్లో తిరుగు ప్రయాణం. ఆన్‌లైన్‌లో టికెట్‌ రిజర్వ్‌ చేయమని అడిగాడు శశాంక్‌. అందుకే అడిగాడు గౌతమ్‌, ‘‘గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి టికెట్‌ బుక్‌ చేయనా?’’ అని. దానికి ఇలా పెద్ద కేకరూపంలో రియాక్షన్‌ వచ్చింది. గౌతమ్‌ చప్పున లేచి, శశాంక్‌ దగ్గరకెళ్ళాడు. అతడి భుజంమీద చేయివేసి సముదాయించాడు. అతను స్థిమితపడే వరకు వేచి ఉన్నాడు. ‘‘ఏం జరిగింది? ఎందుకు అంతలా రియాక్టయ్యావ్‌?’’ అని అనునయంగా అడిగాడు. అతను ఏం చెపుతాడోనని ఆసక్తిగా ఎదురుచూడసాగాడు.

కాసేపటికి తేరుకున్న శశాంక్‌ చెప్పడం మొదలుపెట్టాడు.మూడురోజుల క్రితం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో శశాంక్‌ హైదరాబాద్‌ బయల్దేరాడు. తను ఎక్కిన బోగీలో ఎదురుగా ఉన్న సీట్లో ఒక పెద్దాయన, అతని భార్య, శశాంక్‌ వయసున్న కుర్రాడు కూర్చున్నారు. వాళ్ళే స్నేహపూర్వకంగా మాటలు కలిపి, శశాంక్‌ వివరాలు తెలుసుకున్నారు. వారిమధ్య జరిగిన సంభాషణనుబట్టి వారంతా ఒకపెళ్ళికి వెళుతున్నారని, వారి కుమార్తె ఇంజనీరింగ్‌ చదువుతోందని, రేపటినుంచీ ఆమెకు పరీక్షలు ఉండటంవలన, వాళ్ళ మామయ్య ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని తెలిసింది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత రైలు సామర్లకోట స్టేషన్‌ దాటిన తర్వాత పెద్దాయనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌లో విన్న వార్తకు ఆయనకు మతిపోయింది. ఆయన ఫోన్లో విన్న విషయం భార్యకి, కొడుక్కి చెప్పాడు ఆదుర్దాగా. వాళ్ళ మాటలనుబట్టి వారి కూతురు ‘విమల’ కనబడటం లేదని, ఎంత వెదికినా ఫలితం లేకపోయిందని శశాంక్‌కి అర్థమైంది.

ఎంతో ఆందోళనతో వారు ముగ్గురూ తలో ఫోన్‌తో విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించసాగారు. ఉన్నట్టుండి పెద్దాయన అన్నాడు ‘‘అజయ్‌కి ఫోన్‌ చెయ్యండి, వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది’’ అని. వాళ్ళబ్బాయి కిరణ్‌ అజయ్‌ నంబర్‌కి డయల్‌ చేశాడు. రెస్పాన్స్‌ రాలేదు. ఆ నంబర్‌ మనుగడలో లేదనే ఆన్సర్‌ వచ్చింది. తల్లిసెల్‌లో కూడా అదే నెంబర్‌ ఉంది. దానికి ఫోన్‌ చేసినా అదే పరిస్థితి. అజయ్‌ కొత్త నంబర్‌ వాళ్ళ ముగ్గురికీ తెలియలేదు.