పత్రికల్లో రోజూ ఎన్నో విచిత్రమైన వార్తలూ, విషాదకరమైన వార్తలూ వస్తుంటాయి. ఆ రోజు సింగిల్‌ కాలమ్‌లో వచ్చిన ఒక వార్తను ఎందులో చేర్చాలో నాకు అర్థం కాలేదు. అది విచిత్రంగానూ ఉంది. విషాదకరంగానూ ఉంది. ఇంతకూ వార్తేమిటో చెప్పకుండా ఏదేదో చెప్పే విలేకరి లాగా చెబుతున్నట్టున్నాను. ఆ వార్త సారాంశం ఇది.కడప జిల్లా నందలూరు అనే ఊర్లో ఉన్న సుబ్బరామయ్య అనే కవి చివరి కోరిక ఏమిటంటే... తన అంత్యక్రియల్లో తనతో పాటు తను రచించిన గ్రంథాలను కూడా దహనం చెయ్యాలన్నది. ఆ కోరికే విచిత్రంగా ఉందనుకుంటే, కవి మృతదేహంతో పాటు గ్రంథ దహనం చెయ్యడం విషాదకరంగా ఉంది. 

ఆ ఊరివాడే అయిన ఆ పత్రిక విలేకరికి సుబ్బరామయ్య మరణం కంటే, గ్రంథ దహనం మంచి వార్తగా కనిపించినట్టుంది. ఇది నా ఊహ కాదు. శీర్షిక అయిన ‘కవి చివరి కోరిక’ చివర్న ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉంచడమూ, ఆ కవి కొడుకును కొన్ని ప్రశ్నలడగడమూ చూసి నాకలా అనిపించింది. ఆ విలేకరికి విశేష వార్తగా కనిపించినా పత్రికలో ఉన్నవాళ్ళకి అలా కనిపించినట్టు లేదు. అందుకే దానికి సింగిల్‌ కాలమ్‌ స్థానమిచ్చారు.సరే అది మనకనవసరం. అవసరమైన విషయాన్ని అవసరమైనంత వరకే చెప్పుకుందాం. ఆ విలేకరి అడిగిందేమిటంటే, పుస్తకాలను దహనం చెయ్యడమెందుకు అని. అందుకు కవి గారి కొడుకుగారు చెప్పిన సమాధానం ‘‘అది మా నాన్నగారి కోరిక’’ అని.

విలేకరి రెండో ప్రశ్న వాటిని కాల్చడం కంటే చదివేవాళ్ళకు ఉచితంగా ఇచ్చెయ్యవచ్చు కదా అన్నది. అందుకు సమాధానం ‘‘చదవకపోవడం కంటే తప్పు కాదు అని నాన్నగారన్నారు’’ అన్నది సమాధానం. ప్రధానంగా ఎవరికైనా తట్టేవీ, అడగవలసినవీ అవే కనుక, విలేకరిలో లోపమేమీ కనిపించదు. అయితే వాటికి అనుబంధ ప్రశ్నలూ, అనుబంధ సమాధానాలూ ఆలోచించేకొద్దీ చాలా కనిపిస్తున్నాయి.‘‘చదవకపోవడం కంటే తప్పు కాదు’’ అని సుబ్బరామయ్య అనడంలో, సాధారణార్థమే కాక, సంకేతార్థం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందుకు ఆ వార్తలో ఉన్న కొద్దిపాటి వివరాలు ఆధారం. సుబ్బరామయ్యగారి పుత్రరత్నం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆ తండ్రి రాసిందేమిటో తెలీకపోవడం కాదు. సాహిత్యమంటే ఏమిటో కూడా ఆ లక్ష రూపాయల ఉద్యోగికి తెలీదు. బహుశా ఆ తెలీకపోవడమే తండ్రి కోరికను నిర్వికారంగా నెరవేర్చడానికి తోడ్పడి ఉండవచ్చు. సుబ్బరామయ్యగారి సంకేతం తన వారసుడిని ఉద్దేశించీ ఉండవచ్చు. దహనక్రియను జరపమనడం అందుకు శిక్షించడమూ కావచ్చు.