గంగకోసం నానాతంటాలూ పడుతున్నాడు ఒజ్జు. అతనిబాటే పట్టాడు పీతారావు. ఆమెను ఎలాగైనా బుట్టలో వేసుకోవాల్సిందే . అదే వారి తాపత్రయం . కానీ వాళ్ళ ప్రయత్నాలకు గండభేరుండం అడ్డం పడుతున్నాడు. అతగాడెవరంటే, అమ్మాయిగారి అంగరక్షకుడు మరి! ఇంతకీ ఒజ్జు, పీతారావు ఇద్దరూ ఎలాంటివాళ్ళు? నిజమైన ప్రేమికులా లేక ర్యాగింగ్ బ్యాచ్చా? వాళ్ళగురించి గంగ ఏమనుకుంటోంది?

‘‘నెత్తిమీద పుండు నయం కావాలంటే గుండు చేయించుకోవాల్సిందే!’’ కరాఖండిగా చెప్పాడు డాక్టర్ పిపీలకం.‘‘ఒప్పుకోను గాక ఒప్పుకోను’’ అంతకంటే గట్టిగా అన్నాడు జజ్జు.నవనాగరీకంగా పోషిస్తున్న జుట్టు మరి!వంశపారంపర్యమైన బట్టతల అనే పెనుతుఫానులో తలమునకలు కాకముందే గంగ తనది కావాలి! మనసులో గంగవెర్రులెత్తుతున్న కోరికని ఓరోజు బయటికి పొంగనిచ్చాడు. గంగా నువ్వే నా ప్రాణం అని జుట్టుమీద ఒట్టుబెట్టి చెప్పాడు.‘‘ఓరి జుట్టు పోలిగాడా మా అమ్మాయిగోరి జోలికి వచ్చావంటే నీ ఒంటిమీద వెంట్రుకన్న మాట లేకుండా పీకి పడేస్తా’’అని కూత గీత గీశాడు గంగ అంగరక్షకుడు గండభేరుండం. గీతదాటితే అగ్నిగుండంలో మిడత బతుకే తనది!అయినా రోజుకోసారైనా గంగను చూడాలి. చూస్తున్నట్లు ఎవరూ చూడకుండా చూడాలి. గంగఉండే మేడపక్కన ఖాళీ స్థలంలో పెరిగిన చెట్లకొమ్మల్లో పుల్లాపుడక ముక్కునకరిచి గూడు కట్టుకున్నాడు గుట్టుగా!గోరు చుట్టుమీద రోకటిపోటులా వచ్చి పడింది శిరోవేదన!

‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు. అబ్బాయి నామాట వినకపోతే వైద్యం చేయడం నావల్ల కాదు. రేప్పొద్దున తలపుండు మెదడులోకి దూరితే తలకొరివే మందవుతుంది’’ డాక్టరు చెప్పాడు జజ్జు మేనమామతో.మేలుకొని ఉంటే అయ్యేపనికాదని, గాఢనిద్రలో ఉన్న జజ్జు జుట్టుని కూకటివేళ్లతో కోసి పడేశాడు మేనమామ! గదికి తాళం వేశాడు!

గగ్గోలుపెట్టి, గల్లంతుచేసి, చేష్టలుడిగిపడున్నాడు జజ్జు.ఇక వైద్యం మొదలుపెట్టాలి. ఎందుకైనా మంచిది కిటికీలోంచే లేపనం పూస్తానన్నాడు డాక్టరు. ఆ ప్రక్రియా ప్రయత్న ప్రహసనంలో చేతికందిన మేనమామ చేయి కొరికి కసి తీర్చుకున్నాడు జజ్జు. కానీ, పుండు ఎంతగా పండిపోయిందో అద్దంలో చూసుకుని భయపడ్డాడు.వైద్యానికి తల ఒగ్గాడు.

కనీసం అల్లంత దూరంనుంచైనా గంగను చూసే అదృష్టం కూడా లేకుండాపోయిందే అన్న దుఃఖంతో క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. పరామర్శించడానికి వచ్చినవాళ్ళలో ఒకడైన పీతాగాడు తన పుండుగుండుని సెల్లులో ఫొటోతీసి గంగకు చూపించాడని తెలిసింది. తను రోడ్డెక్కితేమాత్రం పీతాగాడి కాళ్లుచేతులూ ఒకటి ఉండాల్సినచోట ఒకటి ఉంటాయన్న శపథాన్ని బయటికి వదిలాడు! జజ్జు.