ఆ పెట్రోలు బంకులోకి సర్రున దూసుకొచ్చిందో కారు. ట్యాంక్‌ ఫుల్‌చెయ్‌, డ్రైవింగ్‌ సీటులో యువకుడు దర్పంగా అన్నాడు. ఆ పని చేస్తున్న బంకులో కుర్రాడు యదాలాపంగా కారు వెనకసీట్లోకి చూశాడు. అతనికేదో సందేహం వచ్చి మళ్ళీ నిశితంగా గమనించి గుర్తుపట్టాడు వాళ్ళిద్దరినీ. పెట్రోల్‌గన్‌ ఆ సీట్లోకి వదిలి అగ్గిపుల్లగీసి అంటించాలన్నంత ఆగ్రహం వచ్చిందా కుర్రాడికి. ఎందుకని? ఆ వెనకసీట్లో ఉన్నవాళ్ళెవరు?

రివ్వున బంకులోకి వచ్చి ఆగింది బైక్‌. అతని దగ్గరకొచ్చి ‘‘ఎంత’’ అడిగాడు నరేష్‌.‘‘టూ లీటర్స్‌ అన్నా’’ అంటూ జేబులో సెల్‌ఫోన్‌ తీశాడు బైక్‌ కుర్రాడు.‘‘బంక్‌లో సెల్‌ఫోన్‌ వాడకూడదు’’ చెబుతూ టాంకులోకి పెట్రోల్‌గన్‌ పెట్టి ‘‘జీరో చూసుకో’’ అన్నాడు.నరేష్‌మాటకు విలువిచ్చి ఫోన్‌ మళ్ళీ జేబులోకి తోసేశాడు ఆ బైక్‌ కుర్రాడు.పెట్రోల్‌ పోయడం అయ్యాక ‘‘టూ లీటర్స్‌కి తీస్కో’’ క్యాషియర్‌కి చెప్పాడు నరేష్‌.రాత్రి పదిదాటింది. రోడ్లమీద జనం పల్చబడుతున్నారు. సాధారణంగా బిజీగా ఉండే ఆ బంక్‌లో ఆదివారంరాత్రి మాత్రమే కొంచెం పని తగ్గుతుంది. శుక్ర,శనివారాల్లో రాత్రులు తిరిగే సాఫ్ట్‌వేర్‌వాళ్ళతో అసలు తీరిక ఉండదు. తెల్లారితే మళ్ళీ పనులకు వెళ్ళాలనే స్పృహవల్ల కాబోలు ఆదివారం రాత్రి పది తర్వాత మాత్రం పబ్లిక్‌నుంచి కొంచెం తీరుబడి దొరుకుతుంది.

నరేష్‌ వెళ్ళి ఒక పక్కగా ఉన్న స్టూల్‌మీద కూర్చుంటూ, పక్కన పెట్టిన బుక్‌ చేతుల్లోకి తీసుకున్నాడు.పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వారమంతా అస్సలు కుదరడంలేదు. ఇలా టైం దొరికినప్పుడే చదవగలుగుతున్నాడు. కాని అలసటవల్ల పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తోంది.నరేష్‌ జేబులో సెల్‌ వైబ్రేట్‌ అయ్యింది. బయటకు తీసి చూశాడు. ‘‘అమ్మ’’ అన్న అక్షరాలు మెరుస్తున్నాయి. గుండె భారమైంది. బంకులోంచి దూరంగా నడిచి‘‘హల్లో అమ్మా’’ అని పలకరించాడు‘‘ చిన్నా అన్నం తిన్నావా?’’ ఆప్యాయంగా అడిగింది అమ్మ గొంతు.నరేష్‌ గొంతులో వేదన సుడులు తిరిగి కళ్ళల్లో నీళ్ళరూపంలో బయటకి వచ్చే ప్రయత్నం చేస్తోంది.‘‘తిన్నానమ్మా మీరెలా ఉన్నారు?’’ ఒకచేత్తో కన్నీటిని తుడిచేస్తూ, గొంతులో హుషారు పలికిస్తూ అడిగాడు.‘‘మేము బాగానే ఉన్నాం చిన్నా నువ్వు జాగ్రత్త. ఉదయాన్నే కాలేజికి పోవాలి కదా, ఎక్కువసేపు మేల్కొని ఉండబాకు, త్వరగా పడుకో పరీచ్చలట కదా, జాగ్రత్తగా చదువుకో నాన్నా’’ అమ్మ జాగ్రత్తలు చెబుతోంది.