పండక్కి బావని తీసుకెళ్ళడానికొచ్చాడు బామ్మర్ది. అంతలో అక్కడ ఎన్నికల సందడి మొదలైంది. చిరిగిన విస్తరికే మీఓటు అంటూ వచ్చారు కొందరు. వాళ్ళెళ్ళాక పగిలిన బండ గుర్తుకే మీ ఓటు అంటూ మరో పార్టీ దిగబడింది. ఈకలుపీకిన కోడిగుర్తుకే మీ ఓటు బాబూ! అంటూ అంతలోనే ఊడిపడ్డాడు మరో మహానుభావుడు! ఈ సందట్లో బామ్మర్ది తప్పులో కాలేశాడు. ఇంకేముందీ? కొంపకూలి నేలమట్టమైంది!!

ఉలిపి కట్టె!–రాంపాబావ, బావమరిది మంచానికి నవ్వారు బిగిస్తున్నారు ఆరుబయట చెట్టుకింద. ఎన్నికల వేడిలో ప్రచారాలు ఉడుకుతున్నాయి ఊళ్ళో!వేలు నలిగి నొప్పిని దులుపుతున్నాడు బామ్మర్ది. ‘‘పనిమీద శ్రద్ధ లేకపోతే ఇలాగే ఉంటుంది. నీ మెదడెక్కడ ఏడుస్తున్నదిరా’’ అన్నాడు బావ.‘‘రాజకీయాల్లో, విలువలు గంతులు వేస్తున్నాయి. గల్లంతులు చేస్తున్నాయెందుకో అని బుర్ర పక్కకు జారింది బావా’’ చెప్పాడు బామ్మర్ది.‘‘అవ్వే వెధవ ఆలోచనలంటే’’ అన్నాడు బావ.‘‘వెధవ నేనా, నా ఆలోచనా, నేను ఆలోచించే విషయమా’’.అదేదో నువ్వే తేల్చుకో అని బావ అంటుంటే, చినిగిన విస్తరికే మీ ఓటు, చినిగిన విస్తరికే మీ ఓటు! అనే కేకలు వీళ్ల దగ్గర వాలాయి!ఆ గుంపులో ముందు ఉన్నతని చేతులు దండం పెడుతూ అతుక్కుపోయినట్లుగా ఉన్నాయి.

మెళ్లో ప్లాస్టిక్‌ పూలదండ మెరుస్తున్నది. ఏ ప్రశ్న అడిగినా అనుచరుడు (అచ) జవాబు చెబుతున్నాడు.‘‘వాలకం చూస్తే అచ నాయకుడిలా ఉన్నాడు. ‘‘నోరేమో నువ్విప్పుతున్నావు, ఆయన మూగా?’’ అడిగాడు బావ.‘‘మా నాయకుడు మాటలమనిషి కాదు, చేతలమనిషి. ఆయన భాషే చేతలు’’ చెప్పాడు అచ.‘‘సరె సర్లే! ఆ గుర్తేవిటి చిత్రంగా ఉంది’’ అన్నాడు బావ.‘‘మా నాయకుడు, అన్నదానాలు చేసీ చేసీ అలసిపోయినందుకు గుర్తుగా ఆ గుర్తులెండి’’ చెప్పాడు అచ.‘‘నేనెప్పుడూ ఆ ఆన్నం తిన్నట్లు లేదే’’ అన్నాడు బావ.‘‘తిన్నది అరగని వాళ్ళకు కాదండీ, అరగడానికి తిండిలేని వాళ్ళకు లెండి’’ జనం లోంచి జవాబు మోగింది.‘‘అది సరే, అలసిపోవటమేంటి’’ అడిగాడు బావ.‘‘అన్నదానాలు చేసిందానికంటే చేస్తున్నామని చెప్పే ఫ్లెక్సీల ఖర్చే తడిసి మోపెడైంది మరి’’ చెప్పాడు అచ దిగులుగా.‘‘అవి కూడా ఎక్కడా వేళ్ళాడుతున్నట్లు నేను చూళ్ళేదే’’ అడిగాడు బావ.