హైటెక్‌సిటీలో త్రీ బెడ్రూమ్‌ డీలక్స్‌ఫ్లాట్‌. ఆ సంవత్సరమే కొత్తగా సమీర్‌, సాధ్వి దంపతులు దాన్ని కొన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. అక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్త్తున్నప్పుడే ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ‘ప్రేమించి’ అనటం కన్నా ఒకర్నొకరు ఇష్టపడి, అభిప్రాయాలు, అభిరుచులు షేర్‌ చేసుకుని, భవిష్యత ప్రణాళిక చర్చించుకుని ‘ఇద్దరికీ జోడీ సరిపోతుంది..అంతా ఓకే ’ అనుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకున్నారు.వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే పరస్పరం కలిసికూర్చుని మాట్లాడుకుని ఒక ఇంట్లో, ఒక కప్పుకింద సుఖంగా, సంతోషంగా దాంపత్య జీవితం గడపటానికి కావాల్సిన లైఫ్‌స్టైల్‌కి ప్లాన్‌ వేసుకోవడమే.

కుదిరితే ఓ.కే లేకుంటే బై...బై! అంతేగానీ ప్రేమ అంటే పెళ్ళికి ముందే పార్కులు, సినిమాలకు తిరిగేసి అవకాశం దొరికితే హద్దులు మీరేసి ఆ తరువాత మోజు తీరాక ‘నువ్వు నాకొద్దు’ అని ఎవరో ఒకరు అనేసి సమస్యలు కొనితెచ్చుకోవటం కాదు. ‘ప్రేమ’ అంటే మెచ్యూర్డ్‌ యువతకు ‘ఫిజికల్‌ ఎట్రాక్షన్‌’ కాదు. కలిసిన రెండు మనసులు లైఫ్‌ పార్ట్‌నర్స్‌ కావటానికి చేసుకునే అరేంజ్‌మెంట్‌. సమీర్‌, సాధ్విల ప్రేమ అలాంటిదే గనుక వాళ్ళ పెళ్ళికి ఇరుపక్షాల పెద్దలూ అంగీకరించారు. వాళ్ళ పిల్లల తెలివితేటలు, ఆలోచనా విధానం, ప్రవర్తనా నియమాలమీద వాళ్ళకు ఉన్న నమ్మకమే ఎలాంటి అభ్యంతరాలకు తావివ్వలేదు.వాళ్ళేం చేసినా అది డిగ్నిఫైడ్‌గా, రెస్పెక్టబుల్‌గా ఉంటుందన్నది వాళ్ళ గట్టి నమ్మకం.ఆ తర్వాత సమీర్‌, సాధ్వి పెళ్ళి చేసుకుని జీవిత భాగస్వాములయ్యారు. రెండు సింగిల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్స్‌లో విడివిడిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కటయ్యారు. ఇద్దరికీ జీతం లక్షల్లోనే. అందుకే వెంటనే ఒక లగ్జరీ కారు కొన్నారు. ఆ మరుసటి సంవత్సరమే కోటి రూపాయలుపెట్టి త్రీ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ కొనుక్కున్నారు. గృహప్రవేశానికి తన నేటివ్‌ప్లేస్‌ నుంచి తల్లిదండ్రులను తీసుకొచ్చిన సమీర్‌ వాళ్ళకు ఒక బెడ్రూమ్‌ కేటాయించాడు.

ఆ రోజు నుండీ వాళ్ళను అక్కడే ఉంచుకున్నాడు. తండ్రి జయరామ్‌ రిటైర్‌ అయ్యాడు. తల్లి అహల్య కీళ్లనొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అందుకే ఇక నుంచి వాళ్ళ బాధ్యత తను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇల్లు, ఇల్లాలు, కారు సమకూర్చుకోవటం కోసమే ఎదురుచూస్తున్నాడు. సాధ్వికి ఈ విషయం ముందే చెప్పాడు సమీర్‌. ‘అది మన బాధ్యత’ అంటూ మనస్ఫూర్తిగా తన అంగీకారం తెలియజేసింది. ‘నువ్వు మీ తల్లిదండ్రులను తెచ్చుకుంటే నేనూ మా తల్లిదండ్రులను తెచ్చుకుంటాను’ అని పోటీకి రాలేదు. ఎందుకంటే సాధ్వికి ఇద్దరు అన్నలు ఉన్నారు. అల్రెడీ వాళ్ళే తమ తల్లితండ్రుల్ని చూసుకుంటున్నారు. కనుక తన అవసరం అక్కరలేదు. కానీ జయరామ్‌, అహల్యలకు సమీర్‌ ఒక్కడే కొడుకు.