19-10-2017: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ.. సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో ఈసారి మద్దూరి రామమూర్తి రచించిన పద్యకృతి ‘ఆంధ్రభోజీయము’, వచన కవితా ప్రక్రియలో దాసరాజు రామారావు రచించిన ‘పట్టుకుచ్చుల పువ్వు’ సాహితీ పురస్కారాలకు ఎంపికయ్యాయి. బాలసాహిత్యంలో పెండెం జగదీశ్వర్‌ రచించిన ‘గజ్జెల దెయ్యం’.. కథానిక ప్రక్రియలో సామాన్య ‘కొత్తగూడెం పోరగాడికో లవ్‌ లెటర్‌’.. నవలా ప్రక్రియలో బొజ్జాతారకం రచించిన ‘పంచతంత్రం’ నవల, సాహిత్య విమర్శలో పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన ‘విదిత’ పురస్కారాలు పొందాయి. నాటకం-నాటికల్లో సుంకర కోటేశ్వరరావు రచించిన ‘నాయుడు-నాయకురాలు’కు, అనువాదంలో ముకుంద రామారావు రచించిన ‘నోబెల్‌ కవిత్వం’ కు పురస్కారాలు దక్కాయి. ఇతర వచన, రచనల విభాగంలో ఘంటా చక్రపాణి రచించిన ‘తెలంగాణ జైత్రయాత్ర’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో జలంధర రచించిన ‘పున్నాగపూలు’ గ్రంథాలు సాహితీ పురస్కారం పొందాయని వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.