కూచిపూడి నృత్య విన్యాసాలతో నటరాజుకు అంజలి ఘటిస్తూ సంకీర్తనా స్వరాలకు మువ్వలు సవ్వడి చేశాయి. నాట్యాచార్యుడు సప్పాశివకుమార్‌ పర్యవేక్షణలో 85 మంది శిష్య బృందం అవిరామంగా 45 నిమిషాలు నర్తించి కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాయి. 
ఆంధ్రజ్యోతి,విజయవాడ: శ్రీవాగ్దేవి కూచిపూడి నృత్యాలయ ఆధ్వర్యంలో సాయిసుధా ఆర్ట్స్‌ అకాడమి సౌజన్యంతో సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో మంగళవారం 85 మంది విద్యార్ధులు ‘నృత్యహేల’ పేరిట 45 నిమిషాల పాటు నాలుగు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని అవిరామంగా ప్రదర్శించి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులను అందుకున్నారు. సప్పా శివకుమార్‌ నృత్య దర్శకత్వంలో సాగిన ఈ నృత్యహేల ఆద్యంతం నేత్రపర్వంగాసాగింది. సిలికానాంధ్ర స్పూర్తితో ప్రారంభించిన ఈ నృత్య హేలలో జయము జయము, ఆనంద తాండవం అంశాలతో పాటు శివతత్వాన్ని, తాండవ వైశిష్టాన్ని ప్రకటిస్తూ ఈ కీర్తన సాగింది. ‘‘అదివో అల్లదివో శ్రీహరివాసము..’ అంటూ తిరుమల క్షేత్ర ప్రాభవాన్ని తెలియజేస్తూ సాగే కీర్తనలో పన్నగ శయనుని ఆవిష్కరిస్తూ నర్తించారు. నృత్య సంబరాన్ని రికార్డ్సుగా నమోదు చేసి, సప్పా శివకుమార్‌కు వండర్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులను సంస్థల ప్రతినిధి ఆలమండ ప్రసాద్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో వేదాంతం రామలింగశాస్త్రి, కల్చరల్‌సెంటర్‌ సిఈవో ఈమని శివనాగిరెడ్డి, నాట్యాచార్యులు చింతారవి బాలకృష్ణ, పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు, మాగులూరి త్రినాథాచారి, కె.అనిల్‌, వంశీ పాల్గొన్నారు. సభకు ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమి ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. నాట్యానికి నట్టువాంగం సప్పా శివకుమార్‌, గాత్రం-సూర్యనారాయణ, మృదంగం - పి.సత్యనారాయణ, వాయులీనం - పాలపర్తి ఆంజనేయులు, వేణువు-కుమార్‌బాబు, తబల-పసుమర్తి హరనాథశాసి్త్ర సహకరించారు.