ఆబిడ్స్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కవి, అనువాదకుడు జలజం సత్యనారాయణకు తెలంగాణ సారస్వత పరిషత్తు శుక్రవారం ఆలూరి బైరాగి సాహితీ పురస్కారాన్ని అందజేసింది. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి జలజం సత్యనారాయణకు జ్ఞాపికతో పాటు రూ.3,116 నగదు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య శివారెడ్డి మాట్లాడుతూ కవిగా, అనువాదకుడిగా, విద్యావేత్తగా ఆరు దశాబ్దాలా పాటు కృషి చేసి సాహితీ లోకపు ప్రశంసలు అందుకున్న సత్యనారాయణకు ఆలూరి బైరాగి పురస్కారం అందజేయడం ఆయనను సముచితంగా గౌరవించినట్లైందన్నారు. అనువాద రంగంలో విశేషంగా కృషి చేసి అటల్‌ బిహారీ వాజ్‌పేయి, జయశంకర్‌ప్రసాద్‌, కబీర్‌, బిల్హణుడు, ఫైజ్‌ వంటి మహాకవుల కవితలను తెలుగులో అద్భుతంగా అనువదించారని ఆయన కొనియాడారు. 

పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ జలజం పాలమూరు జిల్లాలో సాహితీ వట వృక్షంగా పేరు పొందారని, నిరంతరం సాహిత్యాన్ని శ్వాసిస్తూనే యువతరాన్ని ప్రోత్సహిస్తూ జిల్లాలో సాంస్కృతిక పరిమళాన్ని పంచిపెడుతున్నారన్నారు. జిల్లాలో అధ్యాపకుడిగా ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేరుకునేలా తీర్చిదిద్దారని అన్నారు. జలజం పురస్కారాన్ని స్వీకరించి, ‘ఫైజ్‌ జీవితం-కవిత్వం’ అంశంపై ప్రత్యేక ప్రసంగం చేశారు. జలజం అభిమానులు, సాహితీమిత్రులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. పరిషత్తు ట్రస్టు సభ్యురాలు దాస్‌ వసుంధర వందన సమర్పణ చేశారు.