సామాజిక అంశాలను కథనాలుగా అందించడం సంతోషం: హరీశ్‌

కీర్తి కోసం కాకుండా బాధ్యతగా రచనలు: సిధారెడ్డి

మౌనసాక్షి ద్వారా అక్షర సాక్షి: కె.శ్రీనివాస్‌

నక్షత్రం వేణుగోపాల్‌ మౌనసాక్షి పుస్తకావిష్కరణ

రవీంద్రభారతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జీవనం కొనసాగించినప్పటికీ తెలంగాణ మట్టిని, ఇక్కడి కళలను మరవకుండా కథనాలను రచించిన రచయిత నక్షత్రం వేణుగోపాల్‌ అభినందనీయుడని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలకు వలసలు వెళ్లినా తెలుగు భాషపై మక్కువ పెంచుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రముఖ రచయిత నక్షత్రం వేణుగోపాల్‌ రచించిన మౌనసాక్షి పుస్తకావిష్కరణ సభ శనివారం రవీంద్రభారతిలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీశ్‌రావు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మౌనసాక్షి పుస్తకం ద్వారా సామాజిక అంశాలను కథనాలుగా అందిచడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ 11 కథలు, 3 లఘు చిత్రాలు తీసిన వేణు మానవతా దృక్పథం కలిగిన రచయిత అని అభివర్ణించారు. మానవీయ కోణంలో కథనాలు రచించిన సామాజిక చైతన్యశీలి అని, కీర్తి కోసం కాకుండా బాధ్యతగా రచించారని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ మధ్య మానవీయ ఘర్షణను మౌనసాక్షి ద్వారా అక్షర సాక్షిని చూపించారని అన్నారు. వేణు నక్షత్రం తన కథల ద్వారా భావ ప్రయాణాన్ని కొనసాగించారని చెప్పారు. విప్లవ నిర్మాణంలో పనిచేసిన వేణు విప్లవ సానుభూతివాది అని పేర్కొన్నారు.మౌనసాక్షిలోని అశృవొక్కటి కథ బాగా నచ్చిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ రాములు మాట్లాడుతూ.. సామాజిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మౌనసాక్షి చేసిందని చెప్పారు. సాహితీవేత్త పసునూరి రవీందర్‌ మాట్లాడుతూ.. మానవీయ విలువలు అడుగంటి సందర్భంలో ఇలాంటి పుస్తకాలు రావడం శుభసూచికమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, సాహితీవేత్తలు సత్యనారాయణ, పురుషోత్తం, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.