16-12-2017: రాష్ట్రం కాని రాష్ట్రంలో అమ్మభాష కొడిగట్టుకుపోకుండా తెలుగు వెలుగుల జ్యోతిని చేతులు అడ్డుపెట్టి కాపాడుతున్నారు ప్రవాస తెలుగువారి గోడూ, ఘోషా ఒక్కటే... పరాయిసీమల్లో తెలుగుమాట మాసిపోకూడదని...తెలుగు అక్షరం అంతరించిపోకూడదని....!

అన్యాయం జరుగుతోంది
భాషా అల్పసంఖ్యాకుల మైనారిటీ హక్కులను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో త్రిభాషా సూత్రం పెట్టింది. వారికి మాతృభాషలోనే విద్యను అందించాల్సిన బాధ్యత సదరు రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. గతంలో బళ్లారి లాంటి చోట్ల తెలుగు బోధించే తరగతులు ఆరు వరకూ ఉండేవి. కన్నడం ఒక్కటి మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. తెలుగుకు అన్యాయం జరుగుతోంది.

తెలుగు ఉపాధ్యాయులు రిటైరయ్యాక వారి స్థానంలో మరొకరిని నియమించడం లేదు. దాని వల్ల విద్యార్థులు తెలుగు భాషను నేర్చుకొనేందుకు వీలు ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి భాషా సంస్కృతుల పరిరక్షణకు ఇక్కడి ప్రభుత్వం ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. కర్ణాటక ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని తమ కన్నడ పాఠశాలల కోసం ప్రతి ఏటా రూ. 240 కోట్లను కేటాయిస్తోంది. కన్నడంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం సహాయం కూడా అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగువారికి సహాయం అందించాలని కోరుతున్నాం.

- డా. ఎ. రాధాకృష్ణరాజు, అధ్యక్షుడు, తెలుగు విజ్ఞానసమితి, బెంగళూరు

అక్కడ తెలుగు పీఠమే లేదు

ప్రతి రాష్ట్రానికో పీఠం ఉంటుంది. అవి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. కానీ మన తెలుగు పీఠం మాత్రం మహారాష్ట్రలో లేకపోవడం దారుణం. అందుకే అక్కడ బీఎడ్‌, డీఎడ్‌ నియామకాలు ఉండవు. అవి లేకపోతే తెలుగు టీచర్లను నియమించే అవకాశం ఉండదు. ఇక పరిశోధనలు కూడా ఉండవు. మా పిల్లలకు కూడా తెలుగు మాట్లాడటం వరకూ నేర్పించగలుగుతున్నాం. కానీ రాయడం రావాలంటే స్కూళ్లు ఉండాల్సిందే. గతంలో 52 తెలుగు పాఠశాలలు ఉండేవి. క్రమేపీ వాటి సంఖ్య 16కు చేరింది. ఇక అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులకు ఆ రాష్ట్రంలో భాషను నేర్చుకునే అవకాశం ఉండదు. అలాగే వేరే రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువాళ్ల పిల్లలకు నాన్‌లోకల్‌ కోటాలో చదువుకోవచ్చు. కానీ ఆ సీట్ల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ప్రత్యేకించి వేరే రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారికి ఇక్కడ మరిన్ని సీట్లు కేటాయించాలి. 

- సంగెవేని ర వీంద్ర, ఉపాధ్యక్షుడు, ద బాంబే ఆంధ్ర మహాసభ, ముంబై