ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కళాకారులను గుర్తించి గౌరవించాలని  మూలధ్వని డైరెక్టర్‌ జయధీర్‌ తిరుమలరావు కోరారు.  భారతీయ సంగీత వాయిద్యాలు, సంప్రదాయం, వారసత్వంపై మంగళవారం ఓయూ దూరవిద్యాకేంద్రంలో జాతీయ స్థాయి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులపై ప్రముఖంగా చర్చించినట్లు జయధీర్‌ తిరుమలరావు తెలిపారు. సంగీత కళాకారులను గౌరవించని సమాజం తన కర్తవ్యం మరిచిపోయినట్లేనన్నారు. ప్రొ. మనోజ మాట్లాడుతూ ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎనలేని సేవ చేసి గుర్తింపునకు నోచుకోని కళాకారులకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు పక్క రాష్ర్టాలు, ఇతర దేశాలు చేపట్టిన కార్యక్రమాలను అధ్యయనం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఓయూ వివిధ విభాగాధిపతులు ప్రొ.గణేష్‌, ప్రొ.విజయ్‌కుమార్‌, గ్రీసు పరిశోధకుడు కానిస్టాంటెన్‌, డేనియల్‌ నేజర్స్‌, ఏకే ప్రభాకర్‌ తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు.