చిట్యాల రూరల్‌, జూలై 17: ప్రముఖ బాలల రచయిత, సాహితీవేత్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్‌ మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన జగదీశ్వర్‌ ఇటీవలి వరకు మండలంలోని మునిపంపుల పాఠశాలలో పనిచేశారు. ఇటీవల బదిలీపై చిన్నకాపర్తి జడ్పీహెచ్‌ఎస్ కు వచ్చారు. రోజూలాగే జగదీశ్వర్‌ మంగళవారం రామన్నపేట నుంచి ద్విచక్రవాహనంపై పాఠశాలకు బయలుదేరారు.అయితే ఉదయం చిట్యాల శివారులో రైలు పట్టాలపై జగదీశ్వర్‌ మృతదేహం పడి ఉందని స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

కుటుంబంలో నెలకొన్న వివాదాల వల్ల మనస్తాపం చెందిన జగదీశ్వర్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జగదీశ్వర్‌ 30కి పైగా పుస్తకాలు రచించారు. ఆయన రాసిన ‘చెట్టు కోసం’ అనే కథనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది. కాగా, జగదీశ్వర్‌ తల్లిదండ్రులకు ఒకే కుమారుడు. ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. జగదీశ్వర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 రోజులుగా ఆయన ముభావంగా ఉంటున్నట్లు స్నేహితులు తెలిపారు. ఇంట్లో చిన్నపాటి తగాదాలు జరుగుతుండడం, సున్నిత మనస్కుడు కావడంతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక జగదీశ్వర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.